Reading Time: 2 minutes
Ap Govt Orders On Bc Reservations Green Signal For Panchayat And Municipal Elections

Govt Orders on BC Reservations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేసింది.

బీసీ రిజర్వేషన్లపై జీవో 153

గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవో 105లో ప్రభుత్వం సవరణలు చేసింది. తాజాగా జీవో 153ను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతానికి మించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రామీణ స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించాలని స్పష్టం చేసింది.

రిజర్వేషన్ల రొటేషన్‌

పంచాయతీ ఎన్నికల్లో సీట్లు, పదవుల కేటాయింపు, రిజర్వేషన్ల రొటేషన్‌కు సంబంధించి ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నారు. జీవో 153 అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సమాచారం అందించింది.

మున్సిపల్ ఎన్నికల్లోనూ

పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వు జారీ చేసింది. 2026 అక్టోబర్ 11న మున్సిపల్ పరిపాలన శాఖ జీవో నంబర్ 251ను విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయాలని పేర్కొంది.

UFS, SGSW డేటా ఆధారంగా

బీసీ జనాభా గణనకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS), SGSW డేటాను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. వార్డు సభ్యుల స్థానాలతో పాటు మేయర్లు, చైర్‌పర్సన్ల పదవులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మేయర్, చైర్‌పర్సన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లలో రొటేషన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో అనుసరించిన రిజర్వేషన్ చక్రాన్ని ఆధారంగా చేసుకుని తదుపరి ఎన్నికలకు రొటేషన్ చేపట్టనున్నారు.

వార్డుల పునర్విభజన జరిగితే వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను కొత్తగా ప్రారంభించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు నిర్దేశిత క్రమంలో రిజర్వేషన్ల కేటాయింపు జరగాలని ఆదేశించింది. రిజర్వేషన్ల ఖరారులో సంబంధిత చట్టాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. తదుపరి చర్యలు చేపట్టాలని మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.