కావలసిన పదార్థాలు: 3 గ్లాసుల జొన్నలు, 1 గ్లాసల మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టడానికి & పిండి రుబ్బడానికి తగినన్ని నీళ్లు, దోశలు కాల్చుకోవడానికి తగినంత వంట నూనె
తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో 3 గ్లాసుల తెల్ల జొన్నలు, 1 గ్లాసు మినప్పప్పు వేసుకోవాలి. ఇందులోనే దోశలు మంచి కలర్ రావడానికి ఒక స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మెంతులు వేయాలి. వీటిని నీళ్లు పోసి చేత్తో రుద్దుతూ రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సరిపడా మంచి నీళ్లు పోసి కనీసం 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. జొన్న గింజలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి తగినంత సమయం నానితేనే పిండి మెత్తగా నలుగుతుంది.
8 గంటల తర్వాత నానిన జొన్నలు-మినప్పప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మిక్సీని ఆపుతూ మెత్తటి నునుపైన దోశ పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని మూతపెట్టి రాత్రంతా పులియనివ్వాలి.
మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పులిసి ప్లఫీగా పొంగుతుంది. ఈ కొలతలతో పిండి ఎక్కువగా వస్తుంది కాబట్టి.. ఆ రోజుకు కావలసినంత పిండిని మాత్రమే వేరొక గిన్నెలోకి తీసుకుని, మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో భద్రపరుచుకోవచ్చు వారం రోజుల వరకు వాడుకోవచ్చు. తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి దోశల బ్యాటర్ కన్సిస్టెన్సీకి జారుడుగా కలుపుకోవాలి.
స్టవ్‌పై దోశ పెనం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. పెనం వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఒక గరిటెడు జొన్న పిండిని వేసి పలుచగా రౌండ్‌గా తిప్పాలి. పైనుంచి కొద్దిగా నూనె చల్లి, అడుగు భాగం చక్కగా ఎర్రగా కాలే వరకు ఉంచాలి. ఆ తర్వాత రెండో వైపుకు తిప్పి రెండు నిమిషాలు కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే క్రిస్పీ హెల్దీ ‘జొన్న దోశ’ సిద్ధం! కమ్మని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా కారపు ఎర్ర చట్నీతో నంజుకుని తింటే బియ్యం దోశల కంటే ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుంది!




