Reading Time: 2 minutes
అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కొడుకు ఫోన్ స్విచ్ఆఫ్.. 9 రోజుల తర్వాత.. గుండె పగిలే వార్త

కర్నూలు మాజీ ఎమ్మెల్యే సిపిఎం నేత గఫూర్ తనయుడు కిరణ్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ హోషే లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తొమ్మిది రోజుల తర్వాత తెలిసింది.. కిరణ్ మృతితో తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ నిర్మల దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. గఫూర్ రెండుసార్లు కర్నూలు ఎమ్మెల్యేగా పనిచేశారు. సిపిఎంలో రాష్ట్ర కీలక నేతగా కొనసాగుతుండగా.. తల్లి నిర్మల కర్నూలులో ప్రముఖ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 41 ఏళ్ల కిరణ్ కి త్వరలోనే పెళ్లి చేయాలని అనుకుంటూ ఉండగా.. ఈ విషాదం చోటుచేసుకుంది.

గఫూర్ నిర్మల దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కుమారుడు కిరణ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు అరుణ్ కర్నూలులో డాక్టర్ గా పనిచేస్తున్నారు. మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసిన కిరణ్ కాలిఫోర్నియా రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా అమెజాన్ లో స్థిరపడ్డారు.. ఈ నెల 1న ఆయన తన ఫ్లాట్లో ఉన్నప్పుడు.. అస్వస్థతకు గురయ్యారు.. ఈ విషయాన్ని.. అపార్ట్‌మెంట్‌ మేనేజర్‌కు చెప్పారు. దీంతో అంబులెన్స్‌ పిలిపించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కిరణ్.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.. అయితే.. ఈ విషయాన్ని అపార్ట్‌మెంట్ నివాసితులు కిరణ్ పని చేస్తున్న కంపెనీకి గానీ.. అతని స్నేహితులకు గానీ తెలపలేకపోయారు. దీంతో  ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదు.

ఎవరూ వెళ్లకపోవడంతో..

కిరణ్‌ డ్యూటీకి రాకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో.. ఈ విషయాన్ని కంపెనీ వారు ఈ నెల తొమ్మిదిన కర్నూలులోని పేరెంట్స్‌‌కి ఫోన్ చేసి తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు అమెరికాలోని తెలుగు సంఘాల నేతలకు సమాచారం ఇచ్చారు. వారు ఆరా తీసి.. కిరణ్ చనిపోయాడని.. మార్చురీలో శవం ఉందని తెలియజేశారు. కిరణ్ వెంట ఎవరూ వెళ్లకపోవడంతో.. ఆసుపత్రి యాజమాన్యం శవాన్ని మార్చురీలో ఉంచింది..

కాగా.. కిరణ్ మృతదేహాన్ని కర్నూలుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. దౌత్యపరమైన చర్చలతోపాటు రవాణా ఏర్పాట్లలో తెలుగు సంఘాల నేతలు నిమగ్నమయ్యారు. అయితే ప్రస్తుతం అమెరికాలో మూడు రోజుల వరుస సెలవుల కారణంగా భౌతికకాయం కర్నూలు చేరడానికి సుమారు వారం రోజుల సమయం పట్టవచ్చని పేర్కొంటున్నారు. కిరణ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..