
- రష్యన్ డీజిల్ 2027 వరకు ప్రపంచ మార్కెట్లోకి వచ్చేలా అనుమతి
- ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత్ వంటి పలు దేశాలపై ఏకంగా 100 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తామని గతంలో హెచ్చరించిన ఆయన.. ఇప్పుడు స్వయంగా రష్యాతో చమురు (డీజిల్) ఒప్పందం కుదుర్చుకున్నారు.
అమెరికా కాంగ్రెస్‌కు త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్ ద్వారా చర్చలు జరిపిన అనంతరం ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు.
రష్యాపై గతంలో విధించిన యుద్ధ ఆంక్షలను సడలించినట్లు తెలుపుతూ.. భారీ మొత్తంలో డీజిల్‌ను దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. రష్యా నుంచి వెంటనే 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ రానుందని, నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత లక్షలాది టన్నుల ఇంధనం అమెరికాకు సరఫరా అవుతుందని వివరించారు.
ఈ మేరకు రష్యన్ డీజిల్ ప్రపంచ మార్కెట్లోకి సులువుగా వచ్చేందుకు అమెరికా ట్రెజరీ శాఖ ఏప్రిల్ 2027 వరకు తాత్కాలిక అనుమతిని కూడా జారీ చేసింది. కాగా.. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఫిబ్రవరి నుంచి అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో.. సామాన్య ప్రజలు, రైతులు, ట్రక్ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకే ఈ ఒప్పందం
చేసుకున్నట్లు ట్రంప్ సమర్థించుకున్నారు.
వెల్లువెత్తుతున్న విమర్శలు
ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 100% టారిఫ్ విధిస్తామని హెచ్చరించి, ఇప్పుడు సొంత దేశంలో ఎన్నికల లబ్ధి కోసం ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని పలువురు మండిపడుతున్నారు.
తమ పౌరుల ప్రాణాలు తీస్తున్న రష్యాతో అమెరికా వ్యాపార సంబంధాలు పెట్టుకోవడం సరికాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. 2022లో రష్యా దండయాత్ర చేసినప్పటి నుంచి అమెరికా సహా ఎన్నో దేశాలు రష్యాను ఆంక్షలతో కట్టడి చేశాయని గుర్తుచేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ట్రంప్ తీసుకున్న ఈ యూ-టర్న్.. ప్రపంచ దేశాల ముందు అమెరికా విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసేలా ఉందన్నారు.