Reading Time: 2 minutes
India Rejects Un Human Rights Office Comments Cjp Protests Delhi

CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ నిరసనల సమయంలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంపై ఐక్యరాజ్యసమితి (UN) మానవ హక్కుల కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇవి పూర్తిగా అవాస్తవమని, మా దేశ అంతర్గత విషయాల్లో అనవసర జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన ఆందోళనలు, నిరసనకారులు, లీడర్లు, సివిల్ సొసైటీ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులను ముందస్తుగా, ఆందోళనల సమయంలో అరెస్ట్ చేశారంటూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్‌పై జెనీవాలోని ఐరాసలో భారత్ పర్మినెంట్ మిషన్ ఎక్స్ (X) వేదికగా కౌంటర్ ఇచ్చింది. మా దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రజలకు శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉందని, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఫ్రీ మీడియా, బలమైన వ్యవస్థల ద్వారా ఆ హక్కుకు పూర్తి రక్షణ ఉందని తేల్చి చెప్పింది. ఐరాస ఆందోళనలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, భారత్ అంతర్గత వ్యవహారాల్లో అనవసర జోక్యమని కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున నిరసనల పట్ల కూడా ఐరాస ఇలాగే శ్రద్ధ పెట్టాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే తమ మ్యాండేట్‌ను గుర్తుంచుకోవాలని భారత్ స్పష్టం చేసింది.

మన దేశ ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేస్తూ.. ప్రజలకు శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉందని, అయితే ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని చట్టప్రకారం కొన్ని సహేతుకమైన ఆంక్షలు ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. అక్కడి అధికార యంత్రాంగం చట్టాలకు లోబడే నడుచుకుంటుందని, ఎవరికైనా ఎలాంటి సమస్యలు వస్తే ఆశ్రయించడానికి మన కోర్టులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయని తెలిపింది. మా దేశంలోని రాజ్యాంగ భద్రతలు, ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్, జ్యుడీషియల్ పద్ధతులు పౌరుల సమస్యల పరిష్కారానికి సరైన మార్గాలను చూపుతాయని భారత్ వెల్లడించింది.

అంతకుముందు, ఐరాస హ్యూమన్ రైట్స్ స్పోక్స్‌పర్సన్ తమీమ్ అల్-ఖెతాన్ మాట్లాడుతూ.. ఢిల్లీ నిరసనలకు సంబంధించి పెద్ద ఎత్తున జరిపిన అరెస్ట్‌లపై ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) ఆందోళన చెందుతోందని చెప్పారు. శాంతియుత నిరసన తెలిపే హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు చూడాలని పిలుపునిచ్చారు. శాంతియుత ఆంక్షలపై విధించే నిబంధనలు ఖచ్చితంగా అవసరమైనవిగా, తగిన మోతాదులో ఉండాలని స్పష్టం చేశారు. ఆందోళనకారులను ఎదుర్కొనేటప్పుడు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అత్యంత సంయమనం పాటించాలని సూచించారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారందరినీ వెంటనే, బేషరతుగా విడుదల చేయాలని.. నిరసనకారులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత అధికారులు వాళ్లతో అర్థవంతమైన చర్చలు జరపాలని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) కోరింది.