
ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు అక్కడి సైనిక వ్యవస్థలో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గార్డెన్ క్లీనర్ ఉద్యోగం పేరుతో తమ వారిని సైనిక శిబిరానికి తీసుకెళ్లి, అనంతరం సైనిక శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి పంపిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన మహమ్మద్ అఫ్జల్ ఖాన్, భూక్యా రవీందర్, అశోక్, మెగావత్ ప్రకాశ్ సుమారు ఆరు నెలల క్రితం కూలీ పని కోసం రష్యాకు వెళ్లారు. వారు పనిచేస్తున్న కంపెనీలో ఆరు నెలలకే పని పూర్తికావడంతో ఉపాధి లేకుండా పోయిందని చెబుతున్నారు.
ఈ క్రమంలో మిలిటరీ క్యాంప్‌లో గార్డెన్ క్లీనర్ ఉద్యోగం ఉందని, నెలకు సుమారు రూ.2 లక్షల వేతనం లభిస్తుందని పేర్కొన్న వాల్ పోస్టర్‌ను చూసి వారు సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ ఏజెంట్ కూడా గార్డెన్ క్లీనర్ పని మాత్రమేనని చెప్పడంతో యువకులు ఆ పనికి వెళ్లేందుకు అంగీకరించారని తెలిపారు.
యువకులను మిలిటరీ వాహనంలో సుమారు 12 గంటల పాటు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం అడవి ప్రాంతంలో దించి సైనిక శిక్షణ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.తాము గార్డెన్ క్లీనర్ ఉద్యోగం కోసం వచ్చామని, సైన్యంలో చేరేందుకు అంగీకరించలేదని యువకులు చెప్పినప్పటికీ అక్కడి అధికారులు తమపై దాడి చేశారని వారు కుటుంబ సభ్యులకు వివరించినట్లు సమాచారం.
►ALSO READ | మంత్రి పదవి పోయినందుకు బాధ లేదు.. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: కొండా సురేఖ
ప్రస్తుతం తమకు సైనిక శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి పంపించే ప్రయత్నం జరుగుతోందని యువకులు కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు, వీడియో రికార్డింగుల ద్వారా సమాచారం అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.యుద్ధ ప్రాంతానికి పంపిస్తే తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని, వెంటనే తమను రక్షించి భారత్‌కు తీసుకురావాలని యువకులు వేడుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని యువకులను స్వదేశానికి రప్పించేందుకు సహకరించాలని కోరుతున్నారు.
యువకులు రష్యాకు ఏ విధంగా వెళ్లారు, వారిని ఏ సంస్థ లేదా ఏజెంట్ ద్వారా సైనిక శిబిరానికి తీసుకెళ్లారు, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు అనే అంశాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందిస్తున్న వీడియోలు, వాయిస్ రికార్డింగులు,ఇతర ఆధారాల ఆధారంగా అధికారులు పరిస్థితిని పరిశీలించి, యువకుల భద్రతకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.