Reading Time: < 1 minute

ఎడతెరిపిలేని వర్షాలు: నిండుకుండలా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్

Caption of Image.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. నగరానికి ప్రధాన త్రాగునీటి వనరులైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది.

అనంతగిరి, చేవెళ్ల, నాదర్‌గూడ, వెంకటాపురం తదితర ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో హిమాయత్‌సాగర్‌ జలాశయం నిండుకుండలా మారుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1760.65 అడుగులకు చేరుకుంది. జలాశయంలోకి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇదే స్థాయిలో వర్షాలు కొనసాగితే ఈ రాత్రికి లేదా రేపు జలాశయం ఒకటి రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఉస్మాన్‌సాగర్‌కు కూడా 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 3.512 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.241 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

►ALSO READ | ITIలను ATCలుగా మార్చినందుకు నేను రాజీనామా చేయాలా..?: సీఎం రేవంత్ 

హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తితే దిగువ ప్రాంతాల మీదుగా వరద నీరు మూసీలో కలవనుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే సైరన్ శబ్దాలను గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

©️ VIL Media Pvt Ltd.