Reading Time: < 1 minute

వచ్చే 3 నెలలూ రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం..రైతులకు అవగాహన కల్పిస్తున్నం:  మంత్రి తుమ్మల 

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే మూడు నెలలు ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు. 150 ఏండ్లలో ఎల్‌ నినో వంటి ప్రకృతి వైపరీత్యాన్ని ఎప్పుడు చూడలేదన్నారు. బుధవారం  గాంధీ భవన్ లో జరిగిన ప్రజలతో ముఖాముఖిలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఎల్ నినో చూపే తీవ్రమైన ప్రభావం నుంచి రైతులు తట్టుకునేలా  ప్రచారం చేయిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికీ 30 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ప్రస్తుత పరిస్థితులను గమనించి రైతులు మెట్ట పంటలు వేస్తున్నారని చెప్పారు. ఆయిల్ పామ్  సాగు వైపు రైతులు మొగ్గు చూపడం మంచి పరిణామమని తెలిపారు.

ప్రజల తీర్పుతో మునిగిన వారే మాట్లాడుతున్రు..

తాము అధికారంలోకి వస్తే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామని కేటీఆర్  అనడంపై మంత్రి తుమ్మల స్పందించారు.  ప్రజల తీర్పుతో బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామనడం అర్థరహితమని ఎద్దేవా చేశారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఏ పార్టీ చేపట్టలేదన్నారు. గాంధీ భవన్ ను దేవాలయంగా భావించి, పూర్తి నమ్మకంతో జనం తమ సమస్యలను చెప్పుకొనేందుకు ఇక్కడకు వస్తారని, అలాంటి వారి సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రోగ్రామ్  ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని తెలిపారు. కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్  కొనసాగించడం అభినందనీయమన్నారు

©️ VIL Media Pvt Ltd.