Reading Time: 4 minutes

దంచికొట్టిన వాన…రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తర తెలంగాణలో కుండపోత

Caption of Image.
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. ప్రాజెక్టులకు వరద పోటు
  • ఎల్లంపల్లికి 74,643 క్యూసెక్కులు, జూరాలకు  32,500 క్యూసెక్కుల వరద 
  • ఇటు ఎల్లంపల్లి, అటు జూరాల నుంచి ఎత్తిపోతలు షురూ 
  • నేడు కూడా అతిభారీ వర్షాలుంటాయన్న ఐఎండీ.. ఆరెంజ్​ అలర్ట్​ జారీ

హైదరాబాద్/నెట్​వర్క్​, వెలుగు:  రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఓ మోస్తరుగా మొదలైన చినుకులు.. బుధవారం నాటికి అతిభారీ వర్షాలుగా మారాయి. ఈ సీజన్‌‌లో రెండు నెలలు వట్టిబోయిన వాగులు.. ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా వర్షాలు.. రాష్ట్రమంతటినీ పలకరించాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. 

సీజన్‌‌లోనే హయ్యెస్ట్​ రెయిన్​ఫాల్​ మంగళవారం అర్ధరాత్రి నమోదైంది. దీంతో రాష్ట్రంలో మీడియం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. నిన్నమొన్నటిదాకా డెడ్​స్టోరేజ్‌‌లో ఉన్న కడెం ప్రాజెక్టు ఇప్పుడు భారీ వరదతో నిండుకుండలా మారుతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఇటు కృష్ణా బేసిన్‌‌లోనూ ప్రాజెక్టులకు వరద వస్తున్నది. తాజా వర్షాలతో ఇన్నాళ్లూ లోటులో ఉన్న వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుంటున్నది. గురువారం కూడా రాష్ట్రంలో అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది. 

మంగళవారం అర్ధరాత్రి జోరు వాన..

మంగళవారం  అర్ధరాత్రి దాటాక పలు  జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత  నమోదైంది. ములుగు, జయశంకర్​ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్​, నిజామాబాద్​ జిల్లాల్లో భారీ వర్షాలు పడగా, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం దంచికొట్టింది.

అదే సమయంలో దక్షిణ తెలంగాణ బెల్ట్‌‌లో మాత్రం మోస్తరు వర్షమే కురవడం గమనార్హం. అత్యధికంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా సర్వాయిపేటలో 19.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా సారంగాపూర్​లో 19.6, సిరికొండలో 18.2, గుళ్లకోటలో 17.6, వెల్గటూరులో 16.6, అల్లీపూర్​లో 16, నేరెళ్లలో 14.8, నిర్మల్​ జిల్లా లింగాపూర్​లో 14.6, పెద్దపల్లి జిలా ములకలపల్లిలో 13.6, ములుగు జిల్లా వాజీడులో 13.1, మంచిర్యాల జిల్లా హాజీపూర్​లో 12.7, నిజామాబాద్​ జిల్లా మదనపల్లిలో 11.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. బుధవారం మొత్తం కూడా వర్షాల జోరు కొనసాగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో 15.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా వాజీడులో 14 సెంటీ మీటర్లు, ధర్మవరంలో 13.8, కన్నాయిగూడెంలో 13, వెంకటాపురంలో 12, మేడారంలో 10.4, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవపూర్‌‌‌‌లో 10.3, సర్వాయిపేటలో 10.2, పెద్దపల్లి జిల్లా కూనారంలో 10, మంచిర్యాల జిల్లా జైపూర్​లో 9.8, కరీంనగర్​ జిల్లా గుండిలో 9.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.

ప్రాజెక్టులకు వరద..

ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ముఖ్యంగా మొన్నటిదాకా స్తబ్ధుగా ఉన్న గోదావరి బేసిన్‌‌లో వరద పోటెత్తుతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు క్యాచ్‌‌మెంట్‌‌లో కురుస్తున్న వర్షాలకు 74,643 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. కడెంకు 21 వేల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్​కు 3,500 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ఇటు కృష్ణాలోనూ వరద ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. జూరాలకు నారాయణపూర్​ నుంచి 32,500 క్యూసెక్కుల వరద వస్తుండగా.. నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్​​ లిఫ్ట్​ల నుంచి 3 వేల క్యూసెక్కులదాకా ఎత్తిపోస్తున్నారు. విద్యుదుత్పత్తిద్వారా 35,913 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 18 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఆల్మట్టికి 68,525 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా.. గేట్ల ద్వారా దిగువకు 23,400, విద్యుదుత్పత్తిద్వారా 40 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌‌‌‌కు 62,171 క్యూసెక్కుల వరద వస్తుండగా.. గేట్ల ద్వారా 70 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.  

  • భద్రాచలం మన్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. 17 గేట్లను 2అడుగుల మేర ఎత్తి 79,017 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదిలారు.
  • నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ లోకి ఎగువ నుంచి భారీ వరద వస్తోంది. ఎగువ నుంచి 21 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 685.275 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో కడెం ప్రాజెక్ట్ పరీవాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నది పరీవాహక ప్రాంతంలోకి ఎవరు రావద్దని, పశువులను వదలవద్దని సూచించారు. ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నాయి. గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులలోకి కూడా వరద వస్తోంది. 
  • భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 2,3 ఓసీల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఏరియాలో 6 వేల  టన్నుల ఉత్పత్తి నిలిచిపోయినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఓసీల్లోకి చేరిన వరద నీటిని మోటార్లతో బయటకు పంపుతున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతున్నది. ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటెత్తడంతో మేడిగడ్డ వద్ద 67, 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా అదే స్థాయిలో నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువన భారీ వర్షాలు పడుతున్నందున గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. మహాదేవపూర్ మండలంలో చుండ్రుపల్లి వాగు ఉప్పొంగి లోలెవల్ వంతెన మునిగిపోయింది. మహాముత్తారం మండలంలోని పెద్దవాగు, కోనంపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో యామన్​పల్లి, మహాముత్తారం మధ్య, కాటారం, మేడారం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో పెగడపల్లి, బోర్ల గూడెం, కుకునూరు, రేగుల గూడెం, సింగారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
  • ఆసిఫాబాద్ జిల్లా వట్టివాగు ప్రాజెక్టులోకి భారీ వరద చేరుతుండడంతో మూడు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదిలారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తిర్యాణి మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. గుండివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కెరమెరి మండలం లక్మాపూర్, అనార్ పెల్లి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తిర్యాణి మండలంలోని మంగి, గుండాల, శివగూడ, పంగిడి మాదార, గోవేనా, ఉల్లిపిట్ట, దంతన్ పల్లి, అమీన్‌‌గూడ గ్రామాలవద్ద బ్రిడ్జిలపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో 30 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలలో పత్తి చేన్లలోకి వర్షపు నీరు చేరి పంటలు నీటమునిగాయి. భారీ వర్షాలతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. 
  • భారీ వరద చేరుతుండడంతో అదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. తలమడుగు ముత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టుల నీటిమట్టం పెరుగుతున్నది.
  • నల్గొండ, పెద్దపల్లి మహబూబాబాద్, సిద్దిపేట హనుమకొండ జిల్లాల్లో వర్షం పడింది. 
  • కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ, లింగంపేట పెద్ద వాగు, గాంధారి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి కొద్దిపాటి వరద వస్తున్నది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి 5 వేల క్యూసెక్కుల వరద చేరుతున్నది.
  • మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 75,328 క్యూసెక్కుల వరద రావడంతో ఒక్క రోజులోనే ప్రాజెక్ట్​ కెపాసిటీ 8 నుంచి 12 టీఎంసీలకు చేరుకుంది. ఈ సీజన్లో మొదటిసారి మంచిర్యాలలోని రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. మందమర్రి, కోటపల్లి మండలాల్లో రెండు పాత ఇండ్లు కూలిపోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. బెల్లంపల్లి మండలం కన్నాల ఎర్రచెరువుకు గండిపడంతో వరద ప్రవాహం సమీపంలోని పొలాలను ముంచెత్తింది. ప్రాణహితకు భారీగా వరద రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. 
  • కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో లోయర్ మానేరు డ్యామ్‌‌కు స్వల్పంగా ఇన్ ఫ్లో వస్తోంది. మోయతుమ్మెద వాగు ద్వారా 1,387 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.517 టీఎంసీల నీరు నిల్వఉంది.

సింగరేణి ఓపెన్​ కాస్ట్​ల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బెల్లంపల్లి, రామగుండం రీజియన్లలోని  ఓపెన్​కాస్ట్​ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, ఓవర్​బర్డెన్​(మట్టి) వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెగని వానలతో  క్వారీల్లోకి  భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియాలోని ఎస్సార్పీ, ఇందారం ఓసీపీలు, మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓసీపీ, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరీగూరా ఓసీపీల్లో సుమారు 30 వేల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.  దాదాపు 2 లక్షల క్యూబిక్​ మీటర్ల ఓవర్​ బర్డెన్​(మట్టి) వెలికితీతకు అంతరాయం ఏర్పడింది.   

రామగుండం రీజియన్​ సింగరేణి ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం పరిధిలోని  ఆర్జీ– 1   ఓపెన్​ కాస్ట్​– 5 ప్రాజెక్ట్​లో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 80 వేల క్యూబిక్​ మీటర్ల మట్టి తొలగింపు, ఆర్జీ– 2 ఏరియాలోని ఓపెన్​ కాస్ట్–​ 3 ప్రాజెక్ట్​లో 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.70 లక్షల క్యూబిక్​ మీటర్ల మట్టి తొలగింపు పనులే నిలిచిపోయాయి.  ఓపెన్​కాస్ట్​ గనుల ప్రధాన రహదారులు(హాలేజీ రోడ్లు) బురదగా మారాయి. దీంతో భారీ యంత్రాలైన డోజర్లు, డంపర్లు, షావల్​యంత్రాలు కదల్లేకపోయాయి. స్టాక్​ కోల్​ కూడా రవాణా చేసే పరిస్థితి లేకుండా పోయింది.  భారీ మోటార్లతో  క్వారీలోని వరదనీటిని బయటకు పంపింగ్​ చేస్తున్నారు.  రహదారులపై పేరుకుపోయిన బురదను డోజర్ల  ద్వారా శుభ్రం చేస్తున్నారు.  

©️ VIL Media Pvt Ltd.