Reading Time: < 1 minute
Bhagyashri Borse Emotional Story Mother Blocked Whatsapp Six Months

Bhagyashri Borse ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే తన నిర్ణయం వెనుక ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మొదట నా తల్లితో మాట్లాడాను. కానీ ఆమె నా నిర్ణయానికి అంగీకరించలేదు. ఆ తర్వాత నాన్నను అడిగితే.. ‘మీ అమ్మకు ఇష్టం లేదు’ అని చెప్పారు. కనీసం నా సోదరి అయినా నాకు అండగా ఉంటుందని అనుకున్నాను. కానీ ఆమె కూడా నా నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కుటుంబంలో అందరూ నా ఆలోచనకు వ్యతిరేకంగానే ఉన్నారు” అని తెలిపారు. అయితే నటిగా మారాలనే తన కలను మాత్రం వదులుకోలేదని భాగ్యశ్రీ చెప్పారు.

“ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా లక్ష్యాన్ని వదల్లేదు. ఒక దశలో నా తల్లి నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేశారు. దాదాపు ఆరు నెలల పాటు నాతో మాట్లాడలేదు” అని భావోద్వేగానికి గురయ్యారు. అయినప్పటికీ తనపై తనకు నమ్మకం ఉండేదని, ఒకరోజు తన తల్లి తన గురించి గర్వపడే స్థాయికి చేరుకుంటాననే విశ్వాసమే తనను ముందుకు నడిపించిందని భాగ్యశ్రీ తెలిపారు. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారుతున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.