Reading Time: < 1 minute
Kolusu Parthasarathy Bhogapuram Airport To Transform North Andhra Development

Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుండటం ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు, మధ్యలో అమరావతి సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు చిరునామాగా ఉండేదని, ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందని అన్నారు పార్థసారథి… కూటమి ప్రభుత్వ హయాంలో ఈ మార్పు సాధించడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి కోణంలో కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ కోణంలో మాత్రమే చూసిందని ఆరోపించారు. రెవెన్యూ, భూ వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయని అన్నారు.

జీవో 596ను తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారని, ఆ జీవో రాకముందే 20 నుంచి 25 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు పార్థసారథి.. మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 2014–19 మధ్య విశాఖలో ఐటీ హిల్స్ అభివృద్ధి జరిగిందని, అప్పట్లో వచ్చిన కంపెనీలను కూడా గత ప్రభుత్వం బెదిరించి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఉత్తరాంధ్రపై ఉన్న వెనుకబడిన జిల్లాల ముద్రను తొలగించేందుకు కృషి చేశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించినప్పటికీ, కనీస మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు కూడా ఖర్చు చేయలేదని, ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.