Reading Time: < 1 minute

అలర్ట్… హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

Caption of Image.

భాగ్యనగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం క్రమంగా జోరందుకుంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఈరోజు హైదరాబాద్ నగరానికి ఐఎండి (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్ పూర్తిగా మందకొడిగా కదులుతోంది. రాయదుర్గం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రధాన ఐటీ కారిడార్‌లలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా సర్కిల్, రాయదుర్గం మెట్రో స్టేషన్ మీదుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలో  సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని కంపెనీలు, సంస్థలు ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి దశలవారీగాఉద్యోగులకు ఎర్లీ లాగ్‌అవుట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి.

ఉద్యోగులందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా నివారించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశం. వర్షాల సమయంలో ప్రయాణ ప్రమాదాలను తగ్గించేందుకు, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కంపెనీలు తమ కార్యాలయ ప్రాంతం, ఎర్లీ లాగ్‌అవుట్ సమయాలను ట్రాఫిక్ పోలీసులకు ముందుగానే తెలియజేయాలని కోరారు. ట్రాఫిక్ నిర్వహణకు ఐటీ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు సహకరించాలని.. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.