Reading Time: < 1 minute
Aakasamlo Oka Tara First Single Chitti Chitti Cheema Out Dulquer Salmaan Birthday Surprise Wins Hearts

Aakasamlo Oka Tara: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను చిత్రబృందం విడుదల చేసింది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మెలోడీ సాంగ్‌ను విడుదల చేస్తూ మేకర్స్ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం అవుతుండగా, శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు ప్రముఖ గేయరచయిత శ్రీమణి అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. గాయని రమ్య బెహరా తన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ‘చిట్టి చిట్టి చీమ’ అంటూ జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించాలనే పట్టుదల, కష్టపడే తత్వాన్ని ఈ పాటలో అందంగా చూపించారు.

లిరికల్ వీడియోలో ఆస్ట్రోనాట్ కావాలనే కలతో గ్రామం నుంచి నగరానికి వచ్చిన యువతి ప్రయాణాన్ని, ఆమె ఆశయాలకు హీరో అండగా నిలిచే విధానాన్ని చాలా బాగా చూపించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయాల తర్వాత మరో హృదయాన్ని హత్తుకునే కథతో దుల్కర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఈ పాట స్పష్టం చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘ఆకాశంలో ఒక తార’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.