Reading Time: < 1 minute
Parvathipuram Manyam Collector Attends Mega Ptm As A Parent Wins Praise

Collector Prabhakar Reddy: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM)లో పాల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారు. అధికారిగా కాకుండా.. ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ కుమారుడితో కలిసి పాఠశాలకు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని డీవీఎంఎం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తన కుమారుడు క్రిస్ ధరణ్‌ రెడ్డితో కలిసి కలెక్టర్ పాఠశాలకు వచ్చారు. ఇతర విద్యార్థుల తల్లిదండ్రుల మాదిరిగానే తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఎలాంటి ప్రత్యేక హంగులు, ఆర్భాటాలకు తావివ్వకుండా సాధారణ తల్లిదండ్రిలా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను కలిసి తన కుమారుడి చదువు, విద్యా పురోగతి, ప్రతిభ గురించి తెలుసుకున్నారు. విద్యార్థి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించారు. ఆ తర్వాత స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మెగా పీటీఎం కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత తీసుకురావడంలో కలెక్టర్ పాల్గొనడం ఇప్పుడు వైరల్ గా మారింది.

కలెక్టర్ ప్రభాకరరెడ్డి సాధారణ తల్లిదండ్రిలా తరగతి గదిలో కూర్చోవడం, ఉపాధ్యాయులతో మాట్లాడటం, విద్యార్థులతో కలిసి భోజనం చేయడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ అధికారి అయినప్పటికీ.. తల్లిదండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించిన ఆయన తీరును పలువురు అభినందిస్తున్నారు.