Reading Time: < 1 minute
Sher Singh Gangster Links Uttarakhand Police Cjp Protest

Jantar Mantar: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసన వేదికపై నుంచి ఉత్తరాఖండ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తన భుజానికి ఉన్న బ్యాడ్జీని తీసేసి, అభిజిత్ దీప్కేకు అప్పగించాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న నిరసనకారులు అతడిని పొగుడుతూ, చప్పట్లతో నినానాలు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షేర్ సింగ్ ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నాడని, అతడిపై క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని ఉత్తరాఖండ్ పోలీసులు వెల్లడించారు.

ఐజీ కుమావోన్ నివేదిక కుక్రేటి తెలిపిన వివరాల ప్రకారం.. షేర్ సింగ్ చాలా కాలంలో క్రియాశీలక పోలీస్ విధుల్లో లేరు. 2025లో ఓ క్రిమినల్ కేసులో అరెస్టైన తర్వాత అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతడిపై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నిర్వహిస్తోంది. షేర్ సింగ్‌కు హరిద్వార్-రూర్కీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌స్టర్ ప్రవీణ్ వాల్మీకి ముఠాతో సంబంధాలు ఉన్నాయి. ప్రజల్ని బెదిరించి భూములను అక్రమంగా ఆక్రమించడం, నకిలీ పత్రాల ద్వారా ఆస్తుల్ని బదిలీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్‌గా ఉన్న షేర్ సింగ్, సితార్‌గంజ్ జైలులో మరియు రూర్‌కీ కోర్టులో గ్యాంగ్‌స్టర్ ప్రవీణ్ వాల్మీకిని పలుమార్లు కలవడం ద్వారా తన పదవిని దుర్వినియోగం చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఒక వితంతువుకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు నిందితులకు సహకరించినట్లు పోలీసులు ఆరోపించారు. కేసు విత్ డ్రా చేసుకోవాలని కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడం, కోర్టులో బాధితురాలని బెదిరించే ప్రయత్నం చేయడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఆధారాలు సేకరించిన తర్వాత 2025 సెప్టెంబర్ 15న షేర్ సింగ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దీని తర్వాత నైనిటాల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు తర్వాత విధుల నుంచి సస్పెండ్ అయ్యారు.