Reading Time: 2 minutes
Vaibhav Suryavanshi Fastest T20i Fifty Mayank Yadav Praises Record Ind Vs Zim

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన ఈ 15 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్‌పై భారత ఫాస్ట్ బౌలర్ మయంగ్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ బ్యాటింగ్ శైలి నమ్మశక్యంగా లేదని, అత్యంత చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు ప్రదర్శిస్తున్న ప్రతిభ అద్భుతమని మయంగ్ కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న మయంగ్ మాట్లాడుతూ… ఇంత తక్కువ అనుభవమున్న యంగ్ ప్లేయర్ నుంచి ఇలాంటి షాట్లు ఊహించలేమని, భవిష్యత్తులో అతడు క్రికెట్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

గతంలో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడినప్పుడు కూడా వైభవ్ తమ బౌలింగ్‌ను చితక్కొట్టాడని.. అతడికి బౌలింగ్ వేయాలంటే చాలా జాగ్రత్తగా వేయాలని పేర్కొన్నాడు. అయితే ఈసారి అతడు తమ జట్టులోనే ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ రికార్డు పుస్తకాల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (15 సంవత్సరాల 118 రోజులు) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో జిబ్రాల్టర్ క్రికెటర్ లూయిస్ బ్రూస్ పేరిట ఉన్న రికార్డును అతడు తుడిచిపెట్టేశాడు.

భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం వైభవ్ ప్రతిభను కొనియాడాడు. గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగులు చేసిన అనుభవం వైభవ్‌కు ఉందనీ, ఇక్కడి పిచ్ పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన ఉందని శ్రేయస్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను భారత బౌలర్లు 7 వికెట్లకు 125 పరుగులకే పరిమితం చేశారు. పిచ్‌పై బంతి అనూహ్యమైన బౌన్స్‌తో బ్యాటింగ్‌కు కష్టంగా మారినప్పటికీ, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి, మరో 40 బంతులు మిగిలి ఉండగానే ఎంతో సులువుగా ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల ఓటముల తర్వాత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది మంచి ఊరటనిచ్చే విజయం.