Reading Time: 2 minutes

తెలంగాణ కిచెన్: ఐస్ యాపిల్ తో కూల్ ఫీస్ట్… సమ్మర్ కి బెస్ట్ డ్రింక్స్ ఇవే…!

Caption of Image.

వేసవి వేడి నుంచి ఉపశమనం కావాలంటే తాటి ముంజలే బెస్ట్ ఆప్షన్. సహజమైన చల్లదనంతోపాటు మంచి రుచిని అందించే తాటి ముంజలతో క్రీమీ పుడ్డింగ్‌‌, మ్యాంగో డిలైట్‌‌, కూల్ లస్సీ వంటి సింపుల్​ రెసిపీలు చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే ఈ సమ్మర్ స్పెషల్స్​ని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు.

ఐస్ యాపిల్ లస్సీ

కావాల్సినవి :

తాటి ముంజలు – ఐదు
గడ్డ పెరుగు – ఒక కప్పు
చక్కెర – మూడు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – చిటికెడు
ఐస్ ముక్కలు, పిస్తా, బాదం పప్పు తరుగు – సరిపడా

తయారీ :

తాటి ముంజల పైన ఉండే తొక్క తీసి కొన్నింటిని ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఒక మిక్సీ జార్​లో వేసి అందులో గడ్డ పెరుగు, చక్కెర, యాలకుల పొడి, ఐస్ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. తయారైన లస్సీని సర్వింగ్ గ్లాసుల్లో పోయాలి. పైన ముందుగా కట్​చేసి పెట్టుకున్న తాటి ముంజల ముక్కలు, పిస్తా, బాదం పప్పు తరుగు చల్లాలి.

క్రీమీ పుడ్డింగ్​

కావాల్సినవి :

తాటి ముంజలు – ఐదు 
అగర్ అగర్ – పదిహేను గ్రాములు
చక్కెర, కండెన్స్​డ్ మిల్క్ – ఒక్కోటి అర కప్పు
పాలు – ఒక కప్పు

తయారీ :

మొదటిగా నానబెట్టిన అగర్ అగర్‌‌ను పాత్రలో వేసి కరిగేవరకు వేడి చేయాలి. అందులోనే చక్కెర వేసి పూర్తిగా కరిగాక, ఆ మిశ్రమాన్ని వడకట్టి పుడ్డింగ్ ట్రేలో పోయాలి. దీనిపై సన్నగా తరిగిన తాటి ముంజల ముక్కలు వేసి ఫ్రిజ్‌‌లో పెట్టాలి. అది బాగా గడ్డకట్టిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 
మిక్సీ జార్‌‌లో మరికొన్ని తాటి ముంజల గుజ్జు వేసి కండెన్స్​డ్​ మిల్క్, పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. వేరొక పాత్రలో మిగిలిన అగర్ అగర్‌‌ను వేడి చేసి కరిగించాలి. ఈ వేడి లిక్విడ్‌‌లో ముందుగా గ్రైండ్ చేసిన తాటి ముంజల మిల్క్ మిశ్రమాన్ని పోసి బాగా కలుపుకోవాలి.
పుడ్డింగ్ ట్రేలో మొదటగా తయారుచేసుకున్న జెల్లీ ముక్కలను వేయాలి. వాటిపై ఈ తాటి ముంజల మిల్క్ మిశ్రమాన్ని పోసి, బాగా సెట్ అయ్యేవరకు ఫ్రిజ్‌‌లో ఉంచాలి. పుడ్డింగ్ పూర్తిగా గట్టిపడిన తర్వాత, ట్రేని ప్లేట్‌‌లోకి బోర్లించి ముక్కలుగా కోసి చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి.

మ్యాంగో తాడ్‌‌గోలా డిలైట్

కావాల్సినవి :

తాటి ముంజలు – పది లేదా పన్నెండు
మామిడిపండ్లు – నాలుగు
చక్కెర – ఐదు టేబుల్ స్పూన్లు
పాలు –  ఒకటిన్నర కప్పు
పిస్తా పప్పు తరుగు, ఎండిన గులాబీ రేకులు – సరిపడా

తయారీ :

తాటి ముంజల పైన ఉండే తొక్క పూర్తిగా తీసేసి, చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. మామిడిపండ్ల గుజ్జును కూడా వేరు చేయాలి. సగం తాటి ముంజలు, మామిడి గుజ్జును మిక్సీ జార్‌‌లో వేయాలి. అందులో చక్కెర, పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తాటి ముంజలు, మామిడిపండు ముక్కలు వేసి బాగా కలపాలి. దీన్ని ఒక గంట పాటు ఫ్రిజ్​లో ఉంచాలి. ఆ తర్వాత గిన్నెలో లేదా గ్లాసుల్లో పోసి పైభాగంలో పిస్తా పప్పు తరుగు, ఎండిన గులాబీ రేకులతో గార్నిష్​ చేయాలి.  

©️ VIL Media Pvt Ltd.