Reading Time: < 1 minute
Abhishek Banerjee Why Did The People Beat Mamatas Nephew

Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, కార్యకర్తలు కనిపిస్తే సాధారణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చాలా చోట్ల టీఎంసీ నేతల్ని ప్రజలు కొడుతున్నారు. మమతా బెనర్జీ హయాంలో తమపై జరిగిన అకృత్యాలకు ప్రజలు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. టీఎంసీ కార్యకర్తలు, నేతలు కట్ మనీ రూపంలో తమను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల టీఎంసీ గుండాలు ప్రజల స్థలాలను ఆక్రమించుకుని పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి బీజేపీ వచ్చిన వెంటనే ప్రజలు తిరగబడుతున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సెగ ఇప్పుడు మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీని ప్రజలు చావగొట్టారు. సోనార్‌పూర్‌లో అభిషేక్‌పై శనివారం దాడి జరిగింది. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఆయనపై దాడి చేశారు. చివరకు పోలీసులు, భద్రతా సిబ్బంది ఆయనకు హెల్మెట్ తొడిగి అక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చొక్కా చింపి, కాళ్లతో తన్నుతూ, కోడిగుడ్లు విసిరేస్తూ స్థానికులు దాడికి పాల్పడ్డారు.

దాడి చేసిన స్థానికులు మాట్లాడుతూ.. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, మాకు రోడ్లు ఎప్పుడూ వేయలేదని, వచ్చిన డబ్బంతా దోచుకున్నాడని ఆరోపించారు. ఇప్పటికీ తాము బాధపడుతున్నామని, అందుకే కోపంగా ఉన్నామని చెప్పారు. తాము ఇక్కడే నివసిస్తున్నామని చెప్పారు. మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు రోడ్లు బాగుచేయాలని, నీటి సరఫరా మెరుగుపరచాలని కోరతూ అనేక విన్నపాలు చేసినప్పటికీ, కనీసం పట్టించుకోలేదని చెప్పారు. గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించామని చెబుతున్నారు.

తనపై జరిగిన దాడికి బీజేపీ కారణమని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. తనకు జరిగిందంతా ప్రజలు చూశారని, ఇదంతా బీజేపీ కుట్ర అని ఆయన అన్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు లేరని చెప్పారు. ఈ ఘటనకు అధికార పార్టీ కారణమని టీఎంసీ ఆరోపిస్తుండగా, స్థానికులు మాత్రం తామే దాడికి పాల్పడ్డామని, తమకు ఎలాంటి పార్టీతో సంబంధం లేదని అన్నారు.