Reading Time: < 1 minute
Ipl 2026 Playoff Scenarios One Spot Left As Pbks Csk Rr Dc And Kkr Battle For Final Berth

IPL 2026 Playoff Chances: చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధించిన ఘన విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ గెలుపుతో హైదరాబాద్‌కే కాకుండా.. గుజరాత్ టైటాన్స్‌కు కూడా ప్లేఆఫ్స్ బెర్తు అధికారికంగా ఖరారైపోయింది. ప్రస్తుతం ఈ రెండు జట్లూ చెరో 16 పాయింట్లతో ముందంజ వేసి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాయి. టోర్నీలోని మిగతా జట్లలో కేవలం రాజస్థాన్‌ రాయల్స్‌కు మాత్రమే 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండడంతో.. హైదరాబాద్, గుజరాత్‌ల స్థానాలకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లు తీవ్ర నిరాశపరిచాయి. ఇరు జట్లు పేలవ ప్రదర్శన కనబరిచి.. చాలా ముందే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగాయి. ఇక మిగిలిన ఒకే ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతుండడంతో లీగ్ దశ ముగింపు మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. రాజస్థాన్ జట్టు ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టు తన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే.. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు మిగతా నాలుగు జట్లు ఇంటికి వెళ్లాల్సిందే. ఒకవేళ ఓ మ్యాచ్ ఓడితే మాత్రం రేసు మరింత రసవత్తరం అవుతుంది.

పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఒక్కో మ్యాచ్ ఉంది. అన్ని జట్లు తమ చివరి మ్యాచ్‌లో గెలవడమే కాకుండా.. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా అనుకూలంగా వస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇప్పుడు ఈ జట్ల భవిష్యత్ రాజస్థాన్ చేతిలో ఉంది. రాజస్థాన్ ఓ మ్యాచ్ ఓడాలని, తాము భారీ తేడాతో గెలవాలని కోరుకుంటున్నాయి. పంజాబ్ కింగ్స్ (13), రాజస్థాన్ రాయల్స్ (12), ఢిల్లీ క్యాపిటల్స్ (12), చెన్నై సూపర్ కింగ్స్ (12) కోల్‌కతా నైట్‌రైడర్స్ (11) పాయింట్లతో ఉన్నాయి. చివరి బెర్త్ దక్కించుకునే ఆ లక్కీ టీమ్ ఎదో చూడాలి.