July 12, 2026

Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు

Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
Reading Time: < 1 minute
Tamil Nadu Aiadmk Mlas Shifted To Puducherry Amid Defection Fears

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని గవర్నర్ ఆహ్వానించలేదు. అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను కూడా పిలవలేదు. ఇప్పటికే 113 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు విజయ్ అందజేశారు. అయినా కూడా గవర్నర్ ససేమిరా అన్నారు.

ఇలాంటి తరుణంలో ఏఐఏడీఎంకే (అన్నాడీఎంకే)కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు గట్టు దాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేలో చేరవచ్చని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పళనిస్వామి అప్రమత్తం అయ్యారు. ఎమ్మెల్యేలందరినీ పుదుచ్చేరికి తరలించారు. ఆర్కేఎన్ బీచ్ రిసార్ట్‌‌లో ఎమ్మెల్యేలంతా మకాం వేశారు. లగ్జరీ రూమ్‌లు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలతో పళనిస్వామి సమావేశం కానున్నారు. ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యేలతో ఎంకే. స్టాలిన్ కూడా సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలెవరూ జారిపోకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సోమవారం వెలువడిన ఫలితాల్లో టీవీకే 108, డీఎంకే 59, ఏఐడీఎంకే 47, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, సీవీకే 2, ముస్లిం లీగ్ 2 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతును విజయ్‌కు ప్రకటించింది. వామపక్షాలు మద్దతు ఇస్తే మాత్రం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈజీ అవుతుంది. ఏం జరగబోతుందో రేపు తేలిపోనుంది.