Reading Time: < 1 minute
Tamil Nadu Congress Protest Lok Bhavan Governor Tvks Government Formation Row

తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ నిరాకరించారు. మ్యాజిక్ ఫిగర్ చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అయితే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరుకు నిరసనగా శుక్రవారం లోక్‌భవన్ ఎదుట, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. తమిళనాడు గవర్నర్, బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. బల నిరూపణ అనేది విజయ్ అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటారని.. ముందే ఎలాంటి నిరూపించుకుంటారని కాంగ్రెస్ నిలదీసింది.

సోమవారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్లలో దూరంలో ఉంది. అయితే విజయ్‌కు కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో 113 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు విజయ్ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కానీ గవర్నర్ మాత్రం ససేమిరా అన్నారు. పూర్తి ఫిగర్ చూపిస్తేనే ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.