
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ కుమార్ మ్యాజిక్ మెజారిటీ సాధించే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ద్రవిడ రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే, ఏఐఏడీఎంకేలు చేతులు కలపవచ్చనే సంకేతాల మధ్య, తాను ఆరు నెలల పాటు జోక్యం చేసుకోబోనని ఎంకే స్టాలిన్ ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, టీవీకే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పార్టీ వేచి చూస్తుందని, ఆరు నెలల పాటు జోక్యం చేసుకోబోమని, కేవలం పరిస్థితిని గమనిస్తూ ఉంటామని డీఎంకే అధినేత తెలిపారు.
త్వరలో రాజ్యాంగ సంక్షోభం గానీ, మరో ఎన్నికలు గానీ డీఎంకే కోరుకోవడం లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందని, అలాగే టీవీకే తన ఎన్నికల ప్రణాళికలో చేసిన హామీలను కూడా నెరవేరుస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. తన ప్రాధాన్యతా జాబితాలో అగ్రస్థానంలో ఏముందని అడగగా, ఆయన ఇలా అన్నారు, “కొత్త ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని, అలాగే మహిళా కుటుంబ పెద్దలకు నెలకు రూ. 1,000 భత్యాన్ని కొనసాగించాలన్నారు.”
పార్టీ 2021 మేనిఫెస్టోలో చేసిన హామీలలో 90 శాతాన్ని తమ ప్రభుత్వం నెరవేర్చిందని డీఎంకే అధ్యక్షుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కారణంగా నీట్ రద్దు వంటి కొన్ని హామీలను నెరవేర్చలేకపోయామని తెలిపారు. “ఈ ఎన్నికల్లో కూడా, మేము నెరవేర్చగలిగే హామీలనే ప్రకటించామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఆరు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు ఇస్తామన్న వాగ్దానాన్ని టీవీకే నెరవేర్చగలదని నేను అనుకోవడం లేదు,” అని స్టాలిన్ తెలిపారు.