
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఓటమిని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. లోక్ భవన్కు వెళ్లనని.. గవర్నర్కు రాజీనామా లేఖను ఇవ్వనని దీదీ మొండికేసి కూర్చున్నారు. ఇదిలా ఉండగా.. మే 6వ తేదీతో బెంగాల్ ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తుంది.
ఈ క్రమంలో మమతా బెనర్జీకి రాజీనామా చేసి తప్పుకోవడం తప్ప మరో దారి లేదు. కానీ.. మమత రాజీనామా చేసే సమస్యే లేదంటూ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎందుకంటే.. మన ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తున్న పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే అప్పటికి సీఎం పదవిలో ఉన్న వ్యక్తి గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తారు.
సీఎం స్థానంలో ఉండే శాసనసభా పక్ష నేత రాజీనామాతో శాసనసభ రద్దవుతుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు గెలిచిన పార్టీకి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇప్పటిదాకా ఇలానే జరిగింది. అయితే.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 294 సీట్లకు గాను ఏకంగా 207 స్థానాలు గెలిచింది. అయినప్పటికీ మమతా బెనర్జీ సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేరు.
►ALSO READ | సీఎం పదవికి రాజీనామా చేయను: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ఇలాంటి సమయంలో.. ఏం జరుగుతుందంటే.. ఆమె ప్రతిఘటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆమె ప్రభుత్వానికి ఐదేళ్ల కాల పరిమితి ముగిసిపోయిన మరు క్షణం గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు. ఆమె ప్రభుత్వ పదవీకాలం కూడా ముగుస్తుంది. గెలిచిన పార్టీని కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. ఎమ్మెల్యేల మద్దతు నిరూపించుకున్న అనంతరం.. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన కనీస మెజార్టీ (మ్యాజిక్ ఫిగర్) 148 సీట్లను సునాయాసంగా దాటిన కమలం పార్టీ.. రెండింట మూడొంతుల సీట్ల(196) మార్కును కూడా దాటి సత్తా చాటింది. మమత నేతృత్వంలోని టీఎంసీ బీజేపీ హవాతో ఈసారి 80 సీట్లకే పరిమితమైపోయింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 2, ఏజేయూపీ 2, సీపీఎం 1, ఏఐఎస్ఎఫ్ పార్టీ 1 సీటు చొప్పున గెలుచుకున్నాయి.