Reading Time: 2 minutes

పోస్టాఫీసులో అకౌంట్ ఉందా..? మారిన ఈ రూల్స్ గురించి మీకు తెలుసా..?

Caption of Image.

పోస్టాఫీసుల్లో డబ్బు దాచుకునే సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పులను ప్రకటించింది. ఆదాయపు పన్ను రూల్స్-2026 అమల్లోకి రావడంతో.. ఏప్రిల్ 1 నుండి పోస్టాఫీసు లావాదేవీల తీరు పూర్తిగా మారిపోయింది. ఇకపై పోస్టాఫీసులో ఖాతా తెరవాలన్నా, డబ్బు డిపాజిట్లు విత్‌డ్రాయల్స్ చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా పెద్ద పేమెంట్స్ చేయాలంటే పాన్ తప్పనిసరి. పారదర్శకతను పెంచడం, పన్ను ఎగవేతలను అరికట్టడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చింది.

ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఒకవేళ డిపాజిటర్ వద్ద పాన్ కార్డు లేకపోతే, దానికి బదులుగా ‘ఫామ్ నంబర్ 97’ సమర్పించాల్సి ఉంటుంది. గతంలో పాన్ లేని వారు ఫామ్-60 వాడేవారు. కానీ ఇప్పుడు దాని స్థానంలో ఫామ్-97, 98లను ప్రవేశపెట్టారు. ఇందులో డిపాజిటర్ పేరు, చిరునామా, లావాదేవీ వివరాలను స్పష్టంగా అందించాలి. ఈ ఫామ్‌తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్లను కూడా జత చేయాలి. ఈ ఫామ్‌లను పోస్టాఫీసులు 6 సంవత్సరాల పాటు భద్రపరచాల్సి ఉంటుంది.

మరో కీలక మార్పు ఏమిటంటే.. వడ్డీ ఆదాయంపై టీడీఎస్ కట్ అవ్వకుండా ఉండేందుకు గతంలో వాడే ఫామ్ 15G, 15Hలను రద్దు చేశారు. వీటి స్థానంలో ఇప్పుడు ఒకే ఒక్క ‘ఫామ్ 121’ తీసుకురాబడింది. తమ వార్షిక ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉండి, పన్ను మినహాయింపు కోరుకునే వారు ఈ ఫామ్ 121ను ప్రతి ఆర్థిక సంవత్సరానికి విడిగా సమర్పించాలి. సిస్టమ్ అప్‌డేట్ అయ్యే వరకు పాత ఫామ్‌లు కొనసాగినప్పటికీ.. త్వరలోనే ఫామ్ 121 పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది.

ట్రాన్సాక్షన్స్ రిపోర్టింగ్ విషయంలో కూడా గడువులను కఠినతరం చేశారు. సెప్టెంబర్ 30 వరకు జరిగిన డిక్లరేషన్లను అక్టోబర్ 31 లోపు, అలాగే మార్చి 31 వరకు వచ్చిన వాటిని ఏప్రిల్ 30 లోపు రిపోర్ట్ చేయాలని పోస్టాఫీసులకు సూచించారు. ఈ రూల్స్ వల్ల పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్ మరింత క్రమబద్ధీకరించబడతాయి. సామాన్యులు కూడా తమ ఆర్థిక లావాదేవీల విషయంలో డాక్యుమెంటేషన్‌పై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే పన్ను మినహాయింపులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.