
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ఉన్న ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
తాళం వేసి ఉన్న రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఫీస్‌లోని ఖరీదైన ఫర్నిచర్, కంప్యూటర్లు, కీలకమైన డాక్యుమెంట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో ఆఫీస్ యజమానికి భారీగా నష్టం వాటిల్లింది.