Reading Time: 2 minutes
Preity Zinta Wins Fans Hearts Despite Pbks Loss Vs Rr Ipl 2026 Viral Moment

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ముందుగా పంజాబ్‌ 4 వికెట్లకు 222 రన్స్ చేసింది. మార్కస్ స్టాయినిస్‌ (62 నాటౌట్‌), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (51), వైభవ్‌ సూర్యవంశీ (43), డొనోవన్‌ ఫెరీరా (52 నాటౌట్‌) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన కంటే కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ్యాచ్ ఓడినా.. పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన జట్టు ఆటగాళ్లను ఎంతో ఆప్యాయంగా పలుకరించారు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి ప్రతి ఒక్క క్రీడాకారుడిని వ్యక్తిగతంగా కలిసి అభినందించారు. బాగా ఆడారు అంటూ ఆటగాళ్లను ప్రశంసించారు. అంతేకాదు ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలోని అభిమానులకు పంజాబ్ జెర్సీలను అందించారు. మ్యాచ్ ఓడినా ప్రీతి మోహంలో ఎక్కడా బాధ కనపడనీయకుండా.. మైదానంలో ఆటగాళ్లతో, స్టేడియంలో అభిమానులతో చాలా సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ప్రీతి జింటాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

‘మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రీతి జింటా ఆటగాళ్లను కలిసే విధానం చాలా అద్భుతం. ఐపీఎల్‌లో మరే ఇతర జట్టు యజమాని కూడా ఇంత ఆత్మీయంగా, ఇంత దగ్గరగా ఆటగాళ్లతో మమేకం అవ్వరు’ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘కేవలం గెలిచినప్పుడు మాత్రమే కాకుండా.. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ప్రీతి జింటా ఇచ్చే మద్దతు పంజాబ్ ఆటగాళ్లలో కొత్త ఉత్తేజాన్ని నింపుతోంది’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఫ్రాంచైజీ యజమానులు కేవలం బాక్సులకే పరిమితమవుతారు. కానీ ప్రీతి మాత్రం జట్టులో ఒక సభ్యురాలిగా కలిసిపోతారు. స్టేడియంలో గత రాత్రి ఆమె చూపిన చొరవ.. క్రికెట్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అదొక భావోద్వేగం అని నిరూపించింది.