Reading Time: 2 minutes
Pm Modi Sets Record 8931 Days As Head Of Government Surpasses Pawan Chamling

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. ఒక ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా పనిచేసిన నాయకుడిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును మోదీ అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా కలిపి ఆయన ఇప్పటివరకు 8,931 రోజులు పదవిలో కొనసాగి చరిత్ర పుటల్లో నిలిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపించారు.

కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇలా రాశారు.. ‘దేశం పట్ల, ప్రజల పట్ల ఉన్న అపారమైన భక్తికి మోదీ నిదర్శనం. ఆయన జీవితం నిరంతర సేవా ప్రయాణం. దేశ ప్రయోజనాలే పరమావధిగా ఆయన సాగిస్తున్న పాలన ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకం’ అన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సోషల్ మీడియా ఖాతాల్లో మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. ‘గడిచిన 24 ఏళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం శ్రమించడం మోదీకి మాత్రమే సాధ్యమైంది. పేదలకు హక్కులు కల్పించడం, అభివృద్ధిలో కొత్త రికార్డులు సృష్టించడం ద్వారా ఆయన ‘మోదీ యుగాన్ని’ సృష్టించారు. ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతూనే ఉందన్నారు.

జేపీ నడ్డా (ఆరోగ్య మంత్రి).. ‘మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పుడు ‘వికసిత భారత్’ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మహిళలు, రైతులు, యువత, పేదల సంక్షేమమే లక్ష్యంగా ఆయన పాలన సాగుతోంది. ప్రపంచ వేదికపై నేడు భారత్ ఎంతో శక్తివంతంగా నిలిచింది’.

Also Read:Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?

అశ్విని వైష్ణవ్ (రైల్వే మంత్రి).. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన చెనాబ్ రైల్వే వంతెనపై జాతీయ జెండా పట్టుకున్న ప్రధాని ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఆయన ప్రతి క్షణం దేశ ప్రజల కోసమే’అని కొనియాడారు.

పియూష్ గోయల్ , కిరణ్ రిజిజు.. మోదీ ప్రయాణం కష్టపడే తత్వానికి, నిజాయితీకి నిదర్శనమని, ఇది దేశాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ అక్టోబర్ 2001 నుంచి మే 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం సేవలు అందించారు. ఆ తర్వాత 2014, 2019 , 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి.. మూడుసార్లు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజలు ఆయనపై ఉంచిన అచంచలమైన విశ్వాసమే ఈ సుదీర్ఘ ప్రయాణానికి పునాది అని బీజేపీ నేతలు అభివర్ణించారు.