Reading Time: < 1 minute

అటవీ సంరక్షణలో హరిత రాణులు.. దూలపల్లి అటవీ అకాడమీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Caption of Image.
  • సవాళ్లను ఎదుర్కోవడంలో మహిళలదే పైచేయి: పీసీసీఎఫ్ సువర్ణ

హైదరాబాద్, వెలుగు: అడవుల సంరక్షణలో మహిళా సిబ్బంది ప్రదర్శిస్తున్న అంకితభావం, ధైర్యం అభినందనీయమని అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి (పీసీసీఎఫ్) సువర్ణ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దూలపల్లిలోని అటవీ అకాడమీలో గ్రీన్ క్వీన్స్ (హరిత రాణులు) పేరిట శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అకాడమీ డైరెక్టర్ ప్రియాంక వర్గీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పీసీసీఎఫ్ సువర్ణ, అదనపు డీజీ స్వాతి లక్రా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం కేవలం మహిళలకే పరిమితం కాదని, పురుషులు కూడా ఇందులో భాగస్వాములై సమానత్వ భావనను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

మహిళలు శారీరక శక్తి కంటే మానసిక దృఢత్వంతో క్లిష్టమైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అటవీ శాఖలో బీట్ ఆఫీసర్లుగా పనిచేసే ఉద్యోగుల్లో ఉద్యోగాన్ని వదిలి వెళ్లిన వారిలో సుమారు 60 మంది పురుషులే ఉన్నారని, మహిళలు ఉద్యోగాన్ని వదిలిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.

ఫ్రంట్‌‌ లైన్ సిబ్బంది అడవుల్లో నిరంతరం పనిచేస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అటవీ సంపదను కాపాడుతున్నారని ప్రశంసించారు. అదనపు డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. పోలీస్, వైద్య, అటవీ శాఖల్లో యూనిఫామ్‌‌ ధరించి విధుల్లో ఉన్న మహిళలను చూడటం గర్వంగా ఉందన్నారు. మహిళలు కేవలం భద్రతనే కాకుండా సమాజ భవిష్యత్తును కూడా నిర్మిస్తున్నారని తెలిపారు.

ధైర్యంగా సమాజానికి సేవ చేస్తూ వారు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం అటవీ సంరక్షణలో విశేష ప్రతిభ కనబరిచిన 25 మంది మహిళా సిబ్బందికి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ వన్య సంరక్షణాధికారి వినయ్ కుమార్, సీనియర్ అధికారులు రత్నాకర్ జౌహారీ, సునీత ఎం. భగవత్, క్షితిజ, అర్పణ, శ్రీలక్ష్మి, ప్రవీణ, అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ రేఖభాను తదితరులు పాల్గొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.