Reading Time: < 1 minute
Chandrababu Amaravati Is More Than 29 Villages Capital Works Must Gain Speed

CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఆదేశించారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదని, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి సమగ్ర రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. రాజధాని నిర్మాణంలో స్పీడ్, క్వాలిటీ, డెలివరీ ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని, ఇప్పటికే పనుల వేగం కొంత పెరిగినా ఇంకా మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాజధానిలో ప్రస్తుతం 95 ప్రాజెక్టులకు సంబంధించి రూ.50,999 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఈ పనుల్లో ప్రతి నెల కనీసం 7.92 శాతం పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నిర్ణయించిన గడువులోగా ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం చేపట్టడం నిర్మాణ సంస్థలకు ఒక గొప్ప అవకాశమని, ఆ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోందని, అందువల్ల పనుల్లో ఆలస్యం జరిగే పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారు.

భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్‌ల ఆమోదం వంటి అంశాల్లో అన్ని శాఖలు, ఉన్నతాధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించి పనులు ఆగకుండా చూడాలని సూచించారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలో విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపు, ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఇకపై తాను కూడా స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తయితేనే ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..