Reading Time: < 1 minute
Issf World Cup India Double Medal Isha Singh Manu Bhaker

ISSF World Cup2026 : చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ప్రఖ్యాత ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు డబుల్ మెడల్ ధమాకా లభించింది. హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ముద్దాడగా, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం.. మను పోరాటం

ఫైనల్లో 21 ఏళ్ల ఈషా సింగ్ ఆరంభం నుంచే అద్భుతమైన ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత లక్ష్యాల్లో ఏకంగా 40 హిట్స్ నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మ్యూనిక్ వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తర్వాత ఈషాకు ఇది మరో చిరస్మరణీయమైన గోల్డ్ మెడల్ కావడం విశేషం. మరోవైపు, ఒలింపిక్ విజేత మను భాకర్ తీవ్రమైన పోటీ మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన షూట్-ఆఫ్‌లో గెలిచి, 28 హిట్స్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది.

క్వాలిఫికేషన్ నుంచే భారత జోడీ జోరు

అంతకుముందు జరిగిన అర్హత (క్వాలిఫికేషన్) రౌండ్‌లోనే ఈషా, మను టాప్-2 స్థానాల్లో నిలిచి తమ ఫామ్‌ను చాటుకున్నారు. పతకాలు గెలిచిన అనంతరం ఈషా సింగ్ మాట్లాడుతూ.. గతంలో హాంగ్‌జౌ రేంజ్‌లో పోటీపడిన అనుభవం తనకు ఎంతగానో కలసివచ్చిందని తెలిపింది. అలాగే రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్ , ఆసియా క్రీడలకు ముందు ఈ డబుల్ పతకాల గెలుపు తమకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని మను భాకర్ హర్షం వ్యక్తం చేసింది.