Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi: 8 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 49 బంతుల్లో దడ పుట్టించిన వైభవ్..

Vaibhav Sooryavanshi: మరొకసారి మైదానంలో తుఫాను రేపాడు భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేసి మైదానాన్ని హోరెత్తించాడు. టీ20 ఫార్మాట్‌లో తనదైన శైలిలో విరుచుకుపడుతూ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పాడు.

ఆ ఒక్క షాట్.. సెంచరీ కళ నెరవేరలేదు!

తొలి సెంచరీ ఖాయం అనుకుంటున్న తరుణంలో 15వ ఓవర్‌లో ఊహించని మలుపు తిరిగింది. వెస్లీ మధ్వేరే వేసిన ఆఖరి బంతికి వైభవ్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బ్రాడ్ ఈవాన్స్ అసాధ్యమైన క్యాచ్‌ను సుసాధ్యం చేస్తూ ముందుకు డైవ్ చేసి బంతిని క్యాచ్‌గా మలుచుకున్నాడు. వైభవ్ మైదానం వీడలేక రీప్లే కోసం వేచి చూసినా, టీవీ అంపైర్ అది క్లీన్ క్యాచ్ అని స్పష్టం చేయడంతో తీవ్ర నిరాశతో వెనుతిరిగాడు.

సంచలన ఫామ్.. దిగ్గజాల ప్రశంసలు

కేవలం 15 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు అద్భుత ప్రదర్శన చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు వైభవ్. ఎలాంటి ఒత్తిడి లేకుండా మైదానంలో ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆడుతున్న అతని ఆటకు మాజీ దిగ్గజాలు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సెంచరీ మిస్సయినా, అతను ఆడిన ఆ ఇన్నింగ్స్ జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించింది.

శతకం చేజారినా తన అసాధారణ హిట్టింగ్‌తో మ్యాచ్ రూపురేఖలనే మార్చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. రాబోయే మ్యాచ్‌ల్లో ఈ యువ సంచలనం ఇలాగే విజృంభిస్తే అతి త్వరలోనే తన తొలి అంతర్జాతీయ సెంచరీని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..