Reading Time: < 1 minute
Asaduddin Owaisi Alliance Offer Akhilesh Yadav Up Election 2027

Asaduddin Owaisi: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార బీజేపీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మరోవైపు, యూపీలో సత్తా చాటాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్‌తో పొత్తు కోసం ఓవైసీ బహిరంగ పిలుపు ఇచ్చారు. ఎస్పీతో తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

మొరాదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడకూడదనేది మా లక్ష్యం. అందుకోసం చేతులు కలపడానికి, కూటమి ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్నికలు ముగిసిన తర్వాత బాధపడకుండా ఇప్పుడే చర్చలు ప్రారంభించాలి’’ అని అన్నారు. తాను పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని చెబుతున్నారనని, అలాంటప్పుడు కలిసి పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఓవైసీ అన్నారు. ఎంఐఎం పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదని, గౌరవం, సమాన హక్కులు, న్యాయం కోసమే తమ పోరాటం అని చెప్పారు. అఖిలేష్ యాదవ్‌తో హక్కులు, న్యాయం గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఓవైసీ స్పష్టం చేశారు.

ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ‘‘అఖిలేశ్ యాదవ్, ఓవైసీ ఇద్దరూ బుజ్జగింపు రాజకీయాల్లో పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆ పోటీని పక్కనబెట్టి కలిసి పనిచేయాలని చూస్తున్నారు. అందుకే ఓవైసీ అఖిలేశ్‌కు ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపుతున్నారు’’అని సెటైర్లు వేశారు. ఓవైసీ, అఖిలేష్ నాణానికి రెండు వైపుల లాంటి వారని ఆయన వ్యాఖ్యానించారు.