Reading Time: < 1 minute
Ishan Kishan Missed Run Out Attempt Goes Viral India Vs Zimbabwe 2nd T20

Ishan Kishan: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, మైదానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేసిన ఒక చిన్న పొరపాటు, దాని చుట్టూ జరిగిన హైడ్రామా నెటిజన్లు, అభిమానులకు విపరీతంగా వినోదాన్ని పంచింది.

బ్యాటింగ్‌లో ‘పాకెట్ డైనమైట్’గా అదరగొడుతూ 81 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్, వికెట్ల వెనుక మాత్రం ఒక సరదా తప్పిదంతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్ ఐదో బంతికి జింబాబ్వే బ్యాటర్ తాడివనాషే మరుమని సింగిల్ తీసి, రెండో రన్ వద్దని తోటి బ్యాటర్ న్యూమాన్ న్యామ్‌హురికి సైగ చేశాడు. కానీ అప్పటికే న్యామ్‌హురి నాన్-స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకోవడంతో.. ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపు ఉండిపోయారు. ఆ సమయంలో జింబాబ్వే బ్యాటర్‌ను రనౌట్ చేయడం అత్యంత సులువైన పనిగా అనిపించింది. కేవలం వికెట్లకు బాల్ తగిలిస్తే అయిపోయేది.. కానీ ఆ క్షణంలో ఇషాన్ కిషన్ ఎంఎస్ ధోనీ శైలిలో మెరుపు వేగంతో అండర్ ఆర్మ్ త్రో విసిరి స్టంప్స్‌ను పడగొట్టాలని చూశాడు. దురదృష్టవశాత్తు ఆ త్రో మిస్సై బంతి పక్కకు దూసుకెళ్లడంతో, రనౌట్ అవ్వాల్సిన బ్యాటర్లు కాస్త తేరుకుని ఒక పరుగు పూర్తి చేసుకున్నారు. ఎంఎస్ ధోనీని ఇమిటేట్ చేయబోయి ఇషాన్ ఘోరంగా విఫలమయ్యాడని వ్యాఖ్యాతలు నవ్వుకోగా, ఆ క్షణం మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.