Reading Time: < 1 minute
Nbk111 Team Performs Special Homam For Balakrishnas Speedy Recovery Amid Hospital Treatment

NBK111: నందమూరి బాలకృష్ణ ఇటీవల గాయపడటంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన కాలుకి విజయవంతంగా చిన్న శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇదే సమయంలో బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ‘ఎన్‌బికె111’ చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎన్‌బికె111’ దర్శకుడు గోపీచంద్ మాలినేని బాలకృష్ణ ఆరోగ్యం కోసం బెంగళూరులోని హుస్కూర్, కంబలిపురలో ఉన్న కాటేమ్మ ఆలయంలో ఈ రోజు ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ పూజల్లో సుమారు 18 మంది పూజారులు పాల్గొనగా, బాలయ్యకు చెందిన పలువురు వీరాభిమానులు కూడా హాజరై ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

మరోవైపు బాలకృష్ణ ఈరోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఆయనకు మరికొన్ని వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తిగా ఆగిపోకుండా, తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన నటీనటులతో షూటింగ్ కొనసాగించాలని బాలయ్య స్వయంగా చిత్రబృందానికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గాయం ప్రభావం సినిమా విడుదల తేదీపైనా పడే అవకాశం కనిపిస్తోంది. మొదట నిర్మాతలు ‘ఎన్‌బికె111’ను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, బాలయ్య రికవరీకి పట్టే సమయాన్ని బట్టి షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు రావచ్చని సమాచారం. దీంతో విడుదల కూడా వాయిదా పడే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే బాలకృష్ణ ఆరోగ్యం మెరుగుపడుతుండటం ఊరటనిస్తోంది. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌లో అడుగుపెడతారని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ‘ఎన్‌బికె111’ విడుదల తేదీపై స్పష్టత రాబోయే రోజుల్లో అధికారికంగా వచ్చే అవకాశం ఉంది.