Reading Time: 2 minutes
Ruturaj Gaikwad Reacts After Csk Loss Vs Srh We Will Come Back Stronger Next Year

Captain Ruturaj Gaikwad on CSK Defeat vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం రాత్రి చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ కీలక మ్యాచ్‌లో సీఎస్‌కే చివరి వరకు పోరాడిందని, మ్యాచ్ 18వ ఓవర్ వరకు చెన్నై గెలుపు రేసులోనే ఉందని పేర్కొన్నాడు. 180 పరుగులు ఈ పిచ్‌పై సరైన స్కోరేనని అభిప్రాయపడిన రుతురాజ్.. కొన్ని కీలక అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా తమ ఆటగాళ్ల ప్రదర్శనపై ఎంతో గర్వంగా ఉందని, వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం అని రుతురాజ్ ధీమా వ్యక్తం చేశాడు.

మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘ఇది మంచి టీ20 మ్యాచ్. ఇరి జట్ల మధ్య చివరి వరకు పోటీ కొనసాగింది. మ్యాచ్‌లో పిచ్ ఒకేలా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 180 పరుగులు ఛేజ్ చేయగలిగే స్కోరే. మేము కొన్ని చిన్న అవకాశాలను కోల్పోయాం. కానీ మా ఆటగాళ్ల ప్రతిభపై నాకు గర్వంగా ఉంది. వికెట్ తీసిన వెంటనే ఒత్తిడి పెంచాలి, మేము అది చేయలేకపోయాం. ప్రత్యర్థి వికెట్ కోల్పోయిన వెంటనే మరో వికెట్ కోసం ఒత్తిడి సృష్టించడం చాలా ముఖ్యం. ఆ విషయంలో కొద్దిగా వెనుకబడ్డాం. అయినప్పటికీ మాకు అందుబాటులో ఉన్న జట్టుతో, పరిమిత ఎంపికలతో ఆటగాళ్లు తమ శక్తిమేరకు పోరాడారు’ అని అన్నాడు.

వచ్చే ఏడాది జట్టును మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై కూడా రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ‘మేము మంచి జట్టును నిర్మిస్తున్నాం. చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయి. సంజు శాంసన్ జట్టులో చేరడం మంచి సంకేతం. అతడు బాగా ఆడుతున్నాడు. కార్తిక్ శర్మ కూడా మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కొందరు కీలక ఆటగాళ్లు మాకు అందుబాటులో లేరు. అలాంటి పరిస్థితుల్లో సరైన ప్రత్యామ్నాయాలను వెతకాల్సి ఉంటుంది. అయినా కూడా మా ఆటగాళ్లు బాగా పోరాడారు. సీఎస్‌కే అభిమానుల మద్దతు ఎప్పటికీ మర్చిపోలేము. ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు మాకు మద్దతుగా నిలుస్తుంటారు. గెలిచినా, ఓడినా ఎప్పుడూ మా వెంట ఉంటారు. ఈ సీజన్‌లో కొన్ని హోమ్ మ్యాచ్‌లు ఓడిపోయాం. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి మేము మెరుగ్గా ఆడాం. వచ్చే ఏడాది మరింత బలమైన జట్టుతో తిరిగి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేశాడు. హైదరాబాద్ చేతిలో ఓటమితో సీఎస్‌కే ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా దూరం చేసుకుంది.