Reading Time: < 1 minute
తమిళనాట హైడ్రామా.. విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు.. ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత!

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మద్దతు అంశంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్‌కు చూపడంలో విజయ్ విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన వద్ద 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని లోక్‌భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, CPI, CPM పార్టీల నుంచి మద్దతు లేఖలు అందినప్పటికీ.. కీలకమైన VCK, IUMLల నుంచి లేఖలు అందకపోవడం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇదిలావుంటే, రేపు శనివారం (మే 09) ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరుగుతుందని ప్రచారం జరిగిన వేళ, ఈ పరిణామాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే మూడుసార్లు గవర్నర్‌ను కలిసిన విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, పూర్తిస్థాయి మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో గవర్నర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.

మొత్తానికి చిన్న పార్టీల నిర్ణయాలు ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీవీకే వాదిస్తున్నా, వాస్తవ గణాంకాలు మాత్రం విజయ్‌ను ఊరిస్తున్నాయి. తదుపరి అడుగుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..