Reading Time: < 1 minute
Revanth Reddy Kodangal Development Works Foundation

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి శుక్రవారం తన స్వంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ఆరోగ్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

సీఎం పర్యటనలో ప్రధానంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత లభించనుంది. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ ఆలయాన్ని దాదాపు రూ.110 కోట్ల భారీ వ్యయంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. దీనితో పాటు కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.2 కోట్లు, దౌల్తాబాద్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పనుల కోసం రూ.2.14 కోట్లు వెచ్చించి పునర్నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిధులు కేటాయించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కొడంగల్‌లో సుమారు రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 430 పడకల భారీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ అత్యాధునిక ఆసుపత్రి అందుబాటులోకి వస్తే స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం స్థానికంగానే లభించనుంది. నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన మెరుగైన వైద్య సదుపాయాల దిశగా ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.

అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సభ విజయవంతం కోసం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ కమిషనర్‌ హనుమంతరావు, సమాచార శాఖ కమిషనర్‌ ముకుందరెడ్డి , జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారీతో కలిసి ‘కడా’ అధికారి వెంకట్‌రెడ్డి పనులను స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు భారీగా జనసమీకరణకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.