
చెన్నై: గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో టీవీకే చీఫ్ విజయ్ భేటీ ముగిసింది. గురువారం (మే 7) ఉదయం లోక్ భవన్‌కు వెళ్లిన విజయ్ గవర్నర్‌తో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు.
విజయ్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. భేటీ సందర్భంగా గవర్నర్ కొన్ని కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) లేకుండా 113 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని.. మరేదైనా పార్టీ మద్దతు ఇస్తుందా అని గవర్నర్ విజయ్ ను ప్రశ్నించినట్లు సమాచారం.
113 మందితో స్థిరమైన ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమేనా..? సీఎం పదవి చేపట్టిన తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోగలనని ఏ ప్రాతిపదికన నమ్ముతున్నారని గవర్నర్ సందేహాలు లేవనెత్తినట్లు టాక్. ఇక, గవర్నర్‌తో భేటీ అనంతరం విజయ్ నేరుగా టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. టీవీకే ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే ఉన్నారు.
ఇప్పటికే ఓసారి గవర్నర్‌ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. టీవీకే పార్టీకి 108 మంది సభ్యుల బలం ఉందని.. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు విజయ్. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యా బలం (118 సీట్లు) లేకపోవడంతో విజయ్ రిక్వెస్ట్‌ను గవర్నర్ తిరస్కరించారు. ఈ క్రమంలో గురువారం (మే 7) రెండోసారి గవర్నర్‌తో విజయ్ భేటీ అయ్యారు.