
తాండూర్, వెలుగు: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లి తండాలో బుధవారం రెండువర్గాలు కర్రలతో కొట్టుకున్నాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో నీళ్లపల్లి నుంచి బీఆర్ఎస్కు చెందిన వారు సర్పంచ్, ఉప సర్పంచ్‌గా గెలిచారు. మంగళ, బుధవారాల్లో తండాలో జరిగిన పెండ్లిళ్లకు బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర లీడర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన లీడర్లు కూడా పెండ్లికి వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా జరిగిన విషయాలపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో మాటా మాటా పెరగడంతో కట్టెలతో కొట్టుకున్నారు. దీంతో గ్రామం రణరంగంగా మారింది. ఈ గొడవలో సభావత్ మోత్యానాయక్వర్గానికి చెందిన శంకర్ నాయక్(52) కు తల పగిలింది. దీంతో తాండూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, పోలీసులు మోత్యానాయక్ వర్గానికి చెందిన ఏడుగురు, రమావత్ బాబునాయక్ వర్గానికి చెందిన ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి తెలిపారు.