
యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిజమైన అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు అందుతుంటే కేటీఆర్‌కు కండ్లు మండుతున్నాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బీర్ల ఫౌండేషన్ తరఫున పట్టుబట్టలు, యాటపోతును కానుకగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేండ్ల పాలనలో డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ఊరించిన బీఆర్‌ఎస్ సర్కార్, ఒక్క పేదవాడికైనా పక్కా ఇల్లు కట్టించిందా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని ఇస్తే, కల్వకుంట్ల కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుంటే, తమ మనుగడ ఎక్కడ దెబ్బతింటుందోనని బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నాల పేరుతో బీఆర్‌ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతోందని, క్వింటాలుకు రూ. 500 బోనస్ పొందుతున్న రైతులు వారి మాటలు నమ్మరని స్పష్టం చేశారు. ఇకనైనా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాలని హితవు పలికారు.