
- సైబర్ క్రైమ్, నార్కొటిక్స్ విభాగాల్లో ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్ సేవలు వాడుకుంటాం
- సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కట్టడికి సరికొత్త ప్రణాళికలు
- డీజీపీగా బాధ్యతల స్వీకరణ.. యాక్షన్ ప్లాన్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు చేరుకున్నదని, త్వరలోనే చార్జిషీట్ ఫైల్ చేస్తామని కొత్త పోలీస్ బాస్ సీవీ ఆనంద్ చెప్పారు. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తోందని గుర్తుచేశారు. తెలంగాణ పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తన సతీమణి లలితా ఆనంద్, కుమారులు మిలింద్, నిఖిల్, కోడళ్లు ఐశ్వర్య, వాసంతి, మనువరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం సీవీ ఆనంద్ స్టాఫ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత డీజీపీ కార్యాలయ మీటింగ్‌హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తనది ‘మెక్రో మేనేజ్‌మెంట్’ పాలసీ అని, క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే క్రైమ్ మీటింగ్స్ ద్వారా వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.
- ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలు భర్తీ, డిపార్ట్‌మెంట్‌లో ఏఐ
పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. వీటిలో 5 వేల నియామకాలకు ఇప్పటికే ఆమోదం లభించిందని వెల్లడించారు. నేర నియంత్రణలో, సాంకేతికత వినియోగంలో దేశంలో నంబర్ వన్‌గా నిలిచిన తెలంగాణ పోలీస్ స్థానాన్ని కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. శాంతిభద్రతల నిర్వహణ.. నేర దర్యాప్తులో సాంకేతికతను, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వినియోగం మరింత పెంచుతామన్నారు. గతంలో నక్సల్స్ నియంత్రణ కోసం ఏర్పాటుచేసిన గ్రేహౌండ్స్, ఎస్ఐబీ విభాగాల్లోని సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ విభాగాలకు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదార్థాల కట్టడి, సైబర్ నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రభుత్వ ఆశయాలను నెరవేరుస్తూ, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని డీజీపీ చెప్పారు.
- సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు కట్టడికి సరికొత్త ప్రణాళికలు
శాంతిభద్రతల సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉండడంతో పాటు నేర నియంత్రణలో భాగంగా గస్తీని ముమ్మరం చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంతో పాటు నేరాల సరళి మారిందని, సైబర్ నేరగాళ్లు ఎక్కడో ఉండి మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కొల్లగొడుతున్నారన్నారు. సైబర్ నేరాల కట్టడికి ఏర్పాటు చేసిన టీజీ సైబర్ సెక్యురిటీ బ్యూరో, మత్తుపదార్థాల కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ మాత్రమే కాకుండా.. జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సైతం సైబర్‌నేరాలు, మత్తుపదార్థాల కట్టడిపై దృష్టి పెట్టాలన్నారు. మత్తుపదార్థాల నియంత్రణకు పోలీస్‌తోపాటు విద్యాశాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డ్రగ్స్, గంజాయి కట్టడికి ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు.
- ట్రాఫిక్ నియంత్రణకు రోడ్ సేఫ్టీ బ్యూరో
రోడ్డు ప్రమాదాల్లో మరణాలు, ట్రాఫిక్ చిక్కులు తగ్గించేలా, రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతిన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసేలా, రోడ్ ఇంజినీరింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై దృష్టి పెట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ రోడ్‌సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వ్యవస్థీకృత నేరాలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకృతి
విపత్తులు, భారీ అగ్నిప్రమాదాలు, వరదలపుడు సహాయక చర్యల్లో సమన్వయం పెంచేలా పోలీస్‌శాఖలో శిక్షణ అవసరమన్నారు.
ఏసీబీ, సీఐడీ వంటి విభాగాలకు పూర్వవైభవం తేవడంతో పాటు, వివిధ ప్రభుత్వ విభాగాలతో పోలీస్ పరిధిని అనుసంధానించి సమన్వయం పెంచుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న సీసీ కెమెరాల మరమ్మతులకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డాక్యుమెంటేషన్‌ను పక్కాగా చేస్తామన్నారు. రాష్ట్రంలో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని, మిగిలి ఉన్న వారు కూడా పునరావాస పాలసీ ప్రకారం జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.
- తుది దశలో ఫోన్ ట్యాపింగ్ కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశలో ఉందని, త్వరలోనే సమీక్షించి దానికి తగ్గట్టుగా చార్జ్ షీట్ వేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే, రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తామన్నారు. సమావేశంలో శాంతి భద్రతల డీజీ మహేశ్ భగవత్, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సీఐడీ విభాగం డీజీ చారు సిన్హా, ఐజీలు రమేశ్ రెడ్డి, రమేశ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
- సీవీ ఆనంద్ (1991 ఐపీఎస్ బ్యాచ్) నిర్వహించిన విధులు
- 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్
- 2017లో అదనపు డీజీపీగా పదోన్నతి
- 2021 డిసెంబర్ 24న హైదరాబాద్ సీపీగా నియామకం
- 2023 ఆగస్టు 7న డీజీగా పదోన్నతి
- 2024 సెప్టెంబర్ 7న రెండోసారి హైదరాబాద్ సీపీగా చార్జ్
- 2025 సెప్టెంబర్ 27 నుంచి..
- హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
- 2026 మే 1న పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు