
- ఈనెల 7తో ముగియనున్న పాలకవర్గం గడువు
- కనిపించని ఎన్నికల కసరత్తు
- వార్డుల పునర్విభజనపై స్పష్టత కరువు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఈ నెల 7తో ముగియనుంది. ఇప్పటివరకు ఎన్నికల నిర్వహణకు ఎలాంటి కసరత్తు చేయకపోవడం, వార్డుల విభజనపై కూడా స్పష్టత లేకపోవడంతో బల్దియాలో ప్రత్యేకాధికారి పాలన వచ్చే అవకాశమున్నట్లు ప్రచారం నడుస్తోంది. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ ఎన్నికలతో పాటు సిద్దిపేట మున్సిపాల్టీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. అప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన సాగనుంది.
వార్డుల పునర్విభజనకు అవకాశం
సిద్దిపేట ప్రస్తుత జనాభా 1.45 లక్షలుండగా ఓటర్లు 90 వేల మంది ఉన్నారు. మున్సిపాలిటీలో ప్రస్తుతం 43 వార్డులుండగా ఎన్నికల నాటికి వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కో వార్డులో 2 వేల నుంచి 3 వేల వరకు ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట పట్టణం వేగంగా విస్తరించడంతో పాటు సమీప గ్రామాలు విలీనం కావడంతో వార్డుల విభజన తప్పనిసరిగా మారింది. 2021లో సిద్దిపేటతోపాటు జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తుండడంతో వాటితోపాటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వార్డుల పునర్విభజనపై కసరత్తు జరగకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పాలన సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
వార్డుల పునర్విభజన జరగకున్నా సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌తోపాటు వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను ముందస్తుగానే పూర్తి చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగగా.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలతోపాటు సిద్దిపేటలోనూ వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ రిజర్వేషన్ల ఖరారులో సిద్దిపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవీ బీసీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 స్థానాలకు గానూ ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్ 9, బీసీ మహిళలకు 8, జనరల్ సీట్లు 10, జనరల్ మహిళలకు 12 సీట్లను రిజర్వ్ చేసి ఈ రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నాటికి ఒకవేళ వార్డుల సంఖ్య పెరిగితే కొత్తగా రిజర్వేషన్ల ప్రక్రియను నిర్వహిస్తారు.
ఎన్నికలపై ఆశావహుల ఆశలు
సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం గడువు ముగుస్తుండటంతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా బరిలో నిలవాలని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే సిద్దిపేట మున్సిపాల్టీలో ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశాలున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీల నుంచి అన్ని స్థానాలకు అభ్యర్థులు బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. పాలకవర్గం గడువు ముగిశాక ఎప్పుడు ఎన్నికలు జరిగినా బరిలో నిలవాలనే దిశగా ఆశావహులు అడుగులు వేస్తున్నారు. కాగా ప్రస్తుత పాలకవర్గానికి ఈనెల 4న సన్మానం చేయనున్నారు. మున్సిపల్ చివరి సమావేశాన్ని పూర్తి చేయడంతోపాటు పదవీ కాలం పూర్తవుతుండటంతో సభ్యులకు పౌర సన్మానం చేయనున్నారు.