Reading Time: < 1 minute
Fssai Pan Masala Gutkha Plastic Packaging Ban New Rules

Pan Masala: పాన్ మసాలా, గుట్కా ప్రియులకు, ఆయా కంపెనీలకు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) షాక్ ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటి ప్యాకేజింగ్‌పై అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పాన్ మసాలా, గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయాల్లో త్వరలోనే పెను మార్పులు రాబోతున్నాయి. వీటిని విక్రయించే ప్లాస్టిక్ ప్యాకెట్లు లేదా సాచెట్‌లను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్త డ్రాఫ్ట్ నిబంధనలను సిద్ధం చేసింది.

కొత్త నిబంధనలు ఇవే..
ప్రభుత్వ ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. ఇకపై పాన్ మసాలా వంటి ఉత్పత్తులను ప్లాస్టిక్ ప్యాకెట్లలో అమ్మడం కుదరదు. ప్లాస్టిక్ స్థానంలో కాగితం (Paper), పేపర్ బోర్డ్ లేదా సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ప్యాకెట్లను మాత్రమే వాడాలి. ప్లాస్టిక్, పాలిథిన్, పివిసి వంటి ఏ రకమైన సింథటిక్ మెటీరియల్‌ను ప్యాకేజింగ్ కోసం ఉపయోగించకూడదు. చివరకు అల్యూమినియం ఫాయిల్‌తో కూడిన ప్యాకింగ్‌పై కూడా నిషేధం విధించే అవకాశం ఉంది. కేవలం అమ్మకాలే కాకుండా, ప్లాస్టిక్ సాచెట్లలో ఈ ఉత్పత్తులను నిల్వ చేయడం లేదా ప్యాకింగ్ చేయడంపై కూడా స్పష్టమైన నిషేధాన్ని ప్రతిపాదించారు. ఈ డ్రాఫ్ట్ నిబంధనలపై సాధారణ ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి 30 రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలను ప్రభుత్వం కోరింది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఎందుకు ఈ నిర్ణయం అంటే..
ఈ కీలక నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే.. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని అరికట్టడం. ఈ చిన్నా చితకా ప్యాకెట్లు రీసైక్లింగ్ చేయడం కష్టంగా మారి పర్యావరణానికి పెద్ద ముప్పుగా పరిణమించాయని పర్యావరణ పరిరక్షలు అభిప్రాయపడుతున్నారు. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లోని రసాయనాలు పొగాకు ఉత్పత్తులతో కలిసినప్పుడు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఈ నిబంధనలు అమలులోకి వస్తే, మార్కెట్‌లో పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల రూపమే మారిపోనుంది. పర్యావరణ హితమైన ప్యాకేజింగ్‌లో ఇవి లభించనున్నాయి.