Reading Time: < 1 minute
Jamia Jmi Vc Mazhar Asif Mahadev Dna Comments Rss Yuva Kumbh Controversy

JMI VC Mazhar Asif: జామియా మిలియా ఇస్లామియా (JMI) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజహర్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం ఢిల్లీలోని జామియా క్యాంపస్‌లో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువ కుంభ్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భారతీయుల మూలాల గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భారతీయులందరి డీఎన్‌ఏ (DNA) ఒక్కటేనని, అది ‘మహాదేవుని డిఎన్‌ఏ’ అని వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న విద్యార్థులను ఉద్దేశిస్తూ.. “మీ అందరి మాతృభాషలు వేరు కావచ్చు, మీ సంప్రదాయాలు, సంస్కారాలు వేరుగా ఉండవచ్చు, కానీ మనమందరం భారతీయులం. ఎందుకంటే మన రక్తం, మన డీఎన్‌ఏలో పరమశివుని తాలూకు అంశ ఉంది” అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే సనాతన సంస్కృతి అత్యుత్తమమైనదని, అది అందరి హితాన్ని కోరుకుంటుందని కొనియాడారు.

వైస్ ఛాన్సలర్ తన వాదనను సమర్థించుకోవడానికి శివుని కుటుంబాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణగా చూపారు. కైలాస పర్వతంపై ఉండే మహాదేవుని కుటుంబంలో పరస్పర విరుద్ధమైన జీవులు ఎంతో సామరస్యంగా ఉంటాయని వివరించారు. “శివుని మెడలో పాము ఉంటుంది. వినాయకుడి వాహనం ఎలుక. పార్వతీ దేవి వాహనం సింహం. కార్తికేయుడి వాహనం నెమలి. అలాగే శివుని ముందు నంది ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా చూస్తే పాముకి ఎలుక ఆహారం, నెమలికి పాము ఆహారం, సింహానికి నంది ఆహారం. ఒకరికొకరు శత్రువులైనప్పటికీ.. వీరంతా మహాదేవుని ఇంట్లో కలిసికట్టుగా ఉంటారు. విభిన్న జాతులు, మతాలు, వర్గాలకు చెందిన మనం భారతీయులుగా కలిసి ఉండాలనేది సనాతన సంస్కృతి నేర్పే గొప్ప పాఠం” అని ప్రొఫెసర్ మజహర్ ఆసిఫ్ స్పష్టం చేశారు.

అయితే, ముస్లిం మైనారిటీ విద్యాసంస్థ అయిన జామియాలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడంపై తీవ్ర దుమారం చెలరేగింది. ఎన్ఎస్‌యూఐ (NSUI) సహా పలు విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరసనల సెగల మధ్య క్యాంపస్ వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. ఒకవైపు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగానే, మరోవైపు విసి మజహర్ ఆసిఫ్ ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను సాదరంగా ఆహ్వానిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడం, ‘మహాదేవ డిఎన్‌ఏ’ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.