Reading Time: 2 minutes
Tdp Will Exist As Long As Telugu People Exist Says Chandrababu Naidu

Chandrababu: తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పార్టీ కార్యకర్తలే అసలు బలం అని పేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారని, ఎవరికీ తలవంచరని అన్నారు. నూతన కమిటీలను ఎన్నో వడపోతలు, వ్యూహాలతో ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. సీనియర్లను గౌరవిస్తూ, కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ, కష్టపడి పనిచేసిన వారికి చోటు కల్పించేలా కమిటీలను రూపొందించామని చెప్పారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా విధానంగా మార్చుకున్నామని పేర్కొన్నారు.

Read Also: TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం

ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌చార్జికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించామని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతు ఇచ్చామని చెప్పారు. చదువుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు చంద్రబాబు.. రామ్మోహన్ నాయుడు, శబరి, రాజేష్ వంటి యువ నాయకులను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని, ట్రైనింగ్ క్లాసులు నుంచి కార్యకర్తల సంక్షేమం వరకు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ కృషి చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీకి రావడానికి లోకేష్ కృషే కారణమని పేర్కొన్నారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. అది పదవి కాదని, అత్యున్నత బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో టీడీపీ బలం పెరగాలని, 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే మరింత ఎక్కువ ఓట్లు సాధించాలని పిలుపునిచ్చారు. గతంలో కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలు తనకు గుర్తున్నాయని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కేంద్ర సహకారంతో గట్టెక్కిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని అన్నారు. నిలిచిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామని, అప్పులను రీషెడ్యూల్ చేస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని, ప్రజలకు వాట్సాప్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ సహా పలు ఐటీ సంస్థలను తీసుకువచ్చి విశాఖపట్నాన్ని టెక్ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ప్రత్యర్థి పార్టీపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి నిధులు వస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ ప్రచారంతో ప్రజల్లో అనుమానాలు కలిగించడంలో ప్రత్యర్థి పార్టీ ముందుంటుందని విమర్శించారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కుట్రలకు ఇక కాలం చెల్లిందని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..