Reading Time: 2 minutes
India Rejects Us Permission Russian Oil Iran War Energy Security

India On Russian Oil: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. గత శనివారం ఇజ్రాయిల్-యూఎస్ చేసిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించాడు. దీని తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్, కువైట్‌లపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లో ఉన్న యూఎస్ మిలిటరీ బేస్‌లపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది.

ఈ మొత్తం వ్యవహారంతో చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. దీంతో ఇంధన సంక్షోభం ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది. భారత్‌కు ఒక నెల పాటు రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే పర్మిషన్‌ను అమెరికా ఇచ్చిందని వార్త కథనాలు వెలువడ్డాయి. దీనిపై భారత్ యూఎస్‌కు కౌంటర్ ఇచ్చింది. ‘‘మార్కెట్‌లో ఎక్కడ తక్కువ ధరలకు ముడి చమురు దొరికితే అక్కడ కొనుగోలు చేస్తామని’’ కేంద్రం శనివారం తెలిపింది.

Read Also: BYD Fast Charging: బై బై ఛార్జింగ్ వెయిట్.. BYD ఫ్లాష్ టెక్‌తో 5 నిమిషాల్లో 400KM రేంజ్

“హార్ముజ్ మార్గంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, భారతదేశ ఇంధన సరఫరా సురక్షితంగా మరియు స్థిరంగా ఉంది. భారతదేశం తన ముడి చమురును 27 నుండి 40 దేశాల నుంచి కొంటుంది. బహుళ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను నిర్ధారిస్తుంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, భారతదేశం అత్యంత పోటీతత్వం, సరసమైన ధరలు అందుబాటులో ఉన్న చోట నుండి చమురును కొనుగోలు చేస్తుంది” అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. చమురు కొనుగోళ్ల కోసం భారత్ కు ఏ దేశం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రష్యన్ ఆయిల్ కొనుగోలు కోసం భారత్ ఎప్పుడూ ఏ దేశం అనుమతిపై ఆధారపడలేదని చెప్పింది.

ఫిబ్రవరి 2026లో కూడా భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంది. రష్యా ఇప్పటికీ భారత్‌కు అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారుగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. యూఎస్, యూకే, యూరప్ దేశాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ప్రస్తుతం భారత్ వద్ద 250 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. ఇది 7-8 వారాలకు సరపడే బఫర్ స్టాక్. ప్రస్తుతం, దేశంలో చమురు సంక్షోభం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది.