
మన తెలంగాణ/హైదరాబాద్: కలెక్టర్‌లు పనితీరు మార్చుకోవాలి. కొం దరు కలెక్టర్‌లు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండడం లేదు. వారు తమ పద్ధతిలో మార్పు తీసుకురావాలి. 99 రోజుల పాటు కలెక్టర్‌లు జిల్లా విడిచి వెళ్లొద్దని సిఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్‌లను హెచ్చరించారు. కలెక్టర్‌లు ప్రజలకు అందుబాటులో ఉండని పక్షంలో సహించేది లేదని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కలెక్టర్‌లు పనితీరు మార్చుకోని పక్షంలో కఠిన చర్య లు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆషామాషీగా ఐఏఎస్‌లు కా లేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యతలపై అధికారులకు, కలెక్టర్‌లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని, కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ ప్రజల సమస్యలు అర్థం కావని ఆయన అన్నారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సిఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్‌లను ఆదేశించారు.
ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే
ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులేనని, కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని సిఎం సూచించారు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుందని, మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తామని, వార్షిక పర్ఫామెన్స్ రిపోర్ట్ ఆధారంగా మీ పనితీరు తెలుసుకుంటామని, జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని సిఎం రేవంత్ తెలిపారు.
కలెక్టర్, ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తా
బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలాంటి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఆయన పేర్కొన్నారు. మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహారించాలన్నారు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహారించకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్లు తమ జిల్లాల్లో పంటల వైవిధ్యతకు ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.