Reading Time: < 1 minute

పశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే కారణం

ఇప్పుడు దాడి వల్ల ఇరాన్‌లో ప్రస్తుత తరం మార్పుకు దోహదం

పొరుగుదేశాలతో శాంతి ఒప్పందాలకు అవకాశం

ఫాక్స్‌న్యూస్ ఇంటర్వూలో నెతన్యాహు వెల్లడి

జెరూసలెం : ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించిందని, కొన్ని నెలల్లోనే శక్తివంతం అయ్యేదని అందుకనే ఇజ్రాయెల్, అమెరికా కలిసి అత్యవసరంగా దాడి చేయక తప్పలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంగళవారం “ ఫాక్స్ న్యూస్‌” ఇంటర్వూలో వెల్లడించారు. దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇరాన్ కొత్తగా బాలిస్టిక్ క్షిపణుల తయారీ కోసం భూగర్భంలో అణు కార్యక్రమాల క్షేత్రాలను, బంకర్లను, నిర్మించడం ప్రారంభించిందని ,ఇప్పుడు దాన్ని నివారించకుంటే భవిష్యత్తులో ఏ చర్య తీసుకోలేమని నెతన్యాహు పేర్కొన్నారు.

గత ఏడాది జూన్‌లో 12 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ అణు క్షేత్రాలను, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ధ్వంసం చేశామని, అయినా ఇరాన్ మళ్లీ ప్రారంభించిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు గత ఏడాది నెతన్యాహు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయి. గత ఏడాది ఇరాన్‌పై ఇజ్రాయెల్ చారిత్రక విజయం సాధించిందని నెతన్యాహు వెల్లడించగా, ఇరాన్ అణుకార్యక్రమం పూర్తిగా తుడిచిపెట్టడమైందని ట్రంప్ వెల్లడించారు. ఇప్పుడు దీనికి విరుద్ధంగా నెతన్యాహు ఇంటర్వూలో వెల్లడిస్తున్నారు.

ఇరాన్‌కు వ్యతిరేకంగా అంతులేని యుద్ధం సాగిస్తామన్న ప్రకటనను కొట్టిపారేశారు. ఇరాన్‌లో ప్రస్తుత ఉగ్రవాద తరం బలహీనంగా ఉందన్నారు. అమెరికా, తాము సంయుక్తంగా చేపట్టిన దాడుల వల్ల ఇరాన్‌లో తరం మారడానికి దోహదపడుతుందన్నారు. పశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే ప్రధాన కారణమని, ఆ పాలన అంతమొందితే పశ్చిమాసియాలో శాంతి లభిస్తుందని, ఇజ్రాయెల్, పొరుగున ఉన్న అరబ్, ముస్లిం దేశాలతో శాంతి ఒప్పందాలు కుదురుతాయని వెల్లడించారు. ఇజ్రాయెల్ యుద్ధం లోకి అమెరికాను లాగుతోందన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని కొట్టి పారేశారు.