Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి సంఘటనలో మోడీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆక్షేపించారు. ఇరాన్ అంశంలో భారత్ ప్రదర్శించిన మౌనం తటస్థంగా ఉండటం కాదని, అది పరిత్యాగం చేసినట్టుగా ఉందని సోనియా ఆరోపించారు.భారతీయ విదేశాంగ విధానంపై విశ్వాసం కోల్పోయినట్టుగా ఉందని ఆమె అన్నారు. విదేశీ విధానం అంశంలో భారత్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా ఆమె చెప్పారు. అయితే రెండోదఫా బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ ప్రారంభమైనప్పుడు , భారత్ తీసుకున్న తన నిర్ణయం పట్ల చర్చచేపట్టాలని సోనియా డిమాండ్ చేశారు.

ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సోనియా తన వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసంలో ఆమె ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖమైనీ మృతి చెందినట్టు మార్చి ఒకటో తేదీన ఇరాన్ ధ్రువీకరించిందని, వైమానిక దాడుల్లో ఖమైనీ ప్రాణాలు కోల్పోయారని, ఒకవైపు చర్చలు నిర్వహిస్తూనే మరోవైపు దేశ అధినేతను చంపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని విమర్శించారు. ఇలాంటి షాకింగ్ సంఘటన జరిగినప్పుడు భారత్ వ్యవహరించిన తీరు మరింత షాకింగ్‌గా ఉందన్నారు. ఖమేనీ హత్యగురించి కానీ, ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అంశం గురించి కానీ భారత ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా ఖండించారు.