
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీజీపీఆర్బీ) పోలీస్‌శాఖలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 7,112 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్: కానిస్టేబుల్ (సివిల్) 3,697, కానిస్టేబుల్ (ఏఆర్), కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్– పురుషులు) 24.
తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్: కానిస్టేబుల్ 1,380.
తెలంగాణ జైళ్లు & కరెక్షనల్ సర్వీసెస్ శాఖ: వార్డర్ (పురుషులు) 196, వార్డర్ (మహిళలు) 12.
ఫైర్ ఫైటర్ పోస్టులు: 751 (ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ )డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి).
విద్యార్హతలు: 2026, జులై 29 నాటికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్డ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిపై 5
సంవత్సరాల అదనపు సడలింపు కల్పించింది. అంటే గరిష్ట వయోపరిమితి 27 ఏళ్లు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ స్వీకరణ, ముగింపు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫైనల్
రాత పరీక్ష (ఎఫ్ డబ్ల్యూఈ), సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.tgprb.inను సందర్శించవచ్చు.
ప్రిలిమినరీ రాత పరీక్ష
అప్లై చేసిన అభ్యర్థులందరూ ప్రిలిమినరీ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఒకే పేపర్‌తో 3 గంటల వ్యవధితో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి.
జనరల్ ఇంగ్లిష్ , అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం, భూగోళశాస్త్రం, భారతీయ భూగోళశాస్త్రం, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల సమకాలీన అంశాలు (కరెంట్ అఫైర్స్), రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ టెస్ట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ఒక ప్రశ్నకు ఒకటికి మించి ఎక్కువ సమాధానాలు గుర్తించడం, ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో 1/5వ వంతు (20 శాతం) మార్కులు కోత విధిస్తారు.
కనీస అర్హత మార్కులు: ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ 30 శాతం, బీసీలు 25 శాతం, ఎస్సీ / ఎస్టీ / ఎక్స్ సర్వీస్మన్/ హోమ్‌గార్డులు 20 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
పీఎంటీ / పీఈటీ
ప్రిలిమినరీ ఎగ్జామ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు.
పరుగు: పురుష అభ్యర్థులు 1600 మీటర్ల పరుగును 7 నిమిషాల 15 సెకన్లు, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులు 9 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 5 నిమిషాల 20 సెకన్లలో పూర్తిచేయాలి. కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ పోస్టులకు సంబంధించి పరుగు పందెం కేవలం అర్హత కోసమే ఉంటుంది. ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులు పరుగు పందెంలో ప్రదర్శించే ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.
ఎత్తు: పురుషులు కనీస ఎత్తు 167.7 సెం.మీ., మహిళలు 152.5 సెం.మీ. ఉండాలి. రాష్ట్రంలోని నిర్దిష్ట ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులకు కనీస ఎత్తులో సడలింపు వర్తిస్తుంది.
లాంగ్ జంప్ / షాట్‌పుట్: పురుష అభ్యర్థులు 4 మీటర్ల లాంగ్ జంప్, 6 మీటర్ల షాట్‌పుట్, మహిళా అభ్యర్థులు 2.5 మీటర్ల లాంగ్ జంప్, 4 మీటర్ల షాట్ పుట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్
పీఈటీ అర్హత సాధించిన అభ్యర్థులకు ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ పోస్టులకు 200 మార్కులు, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
సిలబస్: జనరల్ ఇంగ్లిష్ , అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం, భూగోళశాస్త్రం, భారతీయ భూగోళశాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల సమకాలీన అంశాలు (కరెంట్ అఫైర్స్), రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
కనీస అర్హత మార్కులు: అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.